19న విస్తృతంగా సుందరయ్య వర్ధంతి

May 16,2024 00:18

సమావేశంలో మాట్లాడుతున్న పాశం రామారావు
ప్రజాశక్తి-తాడేపల్లి :
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభలు ఈనెల 19న అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. తాడేపల్లి అమరారెడ్డి భవన్‌లో సిపిఎం పట్టణ విస్తృత సమావేశం జి.సుబ్బారెడ్డి అధ్యక్షత బుధవారం నిర్వహించారు. రామారావు మాట్లాడుతూ సుందరయ్య తన జీవితాంతం పేదల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన అనేక ఒడిదుడుకులను తట్టుకుని సిపిఎం అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. సంతానం కలిగితే ఎక్కడ ప్రజాసేవకు ఆటంకం కలుగుతుందోనని తాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుని పేదల పక్షాన నిలిచారన్నారు. సుందరయ్య పార్లమెంట్‌ సభ్యునిగా, శాసనసభ్యునిగా ఉండి ప్రజా సమస్యలను చట్టసభల్లో ఎలుగెత్తి చాటారన్నారు. ప్రథమ పార్లమెంట్‌లో ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు, ప్రతిపక్ష నాయకునిగా సుందరయ్య ఉన్న సంగతిని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో సుందరయ్య ప్రసంగం చేస్తుంటే ప్రధానిగా ఉన్న నెహ్రు ఆసక్తిగా ఆలకించడమే కాకుండా ఆయన చెప్పిన అంశాలను నోట్‌ చేసుకుని సమాధానం చెప్పేవారన్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా సుందరయ్య ప్రాతినిధ్యం వహించారని చెప్పారు. నేడు అసెంబ్లీ, పార్లమెంట్‌ నిర్వహణను చూస్తుంటే ప్రజాస్వామ్యవాదులకు, అభ్యుదయవాదులకు బాధ కలుగుతోందన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలతోనే సరిపెడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయన్నారు. సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని, పాలకవర్గ పార్టీలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి, పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️