జిల్లా వైద్య ఆరోగ్యరంగానికి సుస్తీ చేసింది. 2024-25 సంవత్సరంలో జిల్లాలో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వైరల్ జ్వరాలతోపాటు డయేరియా పెద్దఎత్తున ప్రబలిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలోని పిహెచ్‌సి, సిహెచ్‌సి, ఏరియా, జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందకపోవడంతో ప్రయివేటు ఆస్పత్రులకు పరుగులు తీయిస్తున్నారు. దీనికి తోడు జిల్లా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆధునిక పరికరాల అమరిక దగ్గర నుంచి వైద్యుల నియామకం వంటి సమస్యలతో కునారిల్లుతోంది. ఇటీవలి ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు హాజరైన వేలాది మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితిలో కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి సత్యకుమార్ జిల్లా సర్వజనాస్పత్రి పరిశీలన నేపథ్యంలో కథనం..ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లాలో వైద్యఆరోగ్యరంగం సమస్యలతో సతమతమవుతోంది. పులివెందుల, మదనపల్లి మెడికల్ కళాశాలు 50 మెడికల్ సీట్ల చొప్పున కోల్పోవడంపై పెద్దఎత్తున చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2024-25 అకడమిక్ ఇయర్‌లో పులివెందుల, మదనపల్లి మెడికల్ కళాశాలల్లో మెడికల్ కోర్సులు నిర్వ హించాలనే ఉద్దేశంతో గత వైసిపి సర్కారు పనులను ముమ్మరం చేసింది. 20 24 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేతులు మారడంతో ఎన్డీయే సర్కారు పులివెందుల, మదనపల్లి మెడికల్ కళాశాలలో మెడికల్ సీట్ల నిర్వహణపై చేతులు ఎత్తేయడం ఆందోళన కలిగించింది. రాష్ట్రప్రభుత్వ అసమర్థత ఫలితంగా కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన పులివెందుల, మదనపల్లి మెడికల్ కళాశాలల అకడమిక్ ఇయర్ వాయిదా పడడం సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. అధ్వానంగా సర్వజనుల సేవలు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పర్యవేక్షణ అధ్వానంగా మారింది. రోజూ 1200 నుంచి 1600 మంది ఓపి రోగులు ఆస్పత్రికి వస్తుంటారు. వీరికి వైద్యసేవలు ఎలా అందుతున్నాయో పరిశీలన చేయాలి. ఉదయం, సాయంత్రం సర్వజన ఆస్పత్రి నిర్వాహకులు రౌండ్లగా వారీగా పర్యవేక్షణ నిర్వహించడంలో లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితంగా పలువురు వైద్యులు మధ్యాహ్నం లోపలే సొంత ఆస్పత్రులకు పరుగులు తీయడం పరిపాటిగా మారింది. గతంలో రిమ్స్ ప్రత్యేకాధికారి పని చేసిన ఐఎఎస్ అధికారి హయాంలో సాయంత్రం వరకు వైద్యులు విధులు నిర్వహించేవారు. సాయంత్రం వరకు ఓపి సేవలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఇటువంటి ప్రసక్తే లేకపోవపడం గమనార్హం. మందకొడిగా సూపర్ స్పెషాలిటీ సేవలుజిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జిల్లా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో సుమారు రూ.60 కోట్లతో కూడిన ఆధునిక పరికరాలను కేటాయిం చింది. వీటిని ఏర్పాటు చేయడానికి సంబంధించిన టెక్నీషియన్లు లేకపోవడం, వైద్యపరీక్షలు నిలిచిపోవడంతో సూపర్ సేవలు అందడం లేదు. దీనికి తోడు 11 విభాగాలకు చెందిన వైద్య సేవలు అందుతున్నట్లు కనిపించినప్పటికీ ఆచరణలో రెండు, మూడు విభాగాల సేవలు అందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో తొమ్మిది సిహెచ్‌సిల పనితీరు ఆశించిన రీతిలో కనిపించడం లేదు. బద్వేల్, పోరుమామిళ్ల పిహెచ్‌సిల్లో వైద్యుల కొరత పీడిస్తోంది. ఐదు నెలల కిందట ప్రభుత్వం ఎంసెట్ పరీక్షలు నిర్వహించింది. 2024-25 అకడమిక్ ఇయర్ ప్రారంభ మైంది. కానీ ఇప్పటివరకు ఎంసెట్ రాసిన వేలాది మంది విద్యార్థులు అడ్మిషన్లు అడ్మిషన్లు ఎప్పుడు ఉంటాయో తెలియడం లేదనే ఆందోళనలో ఉన్నారు.1200 జిఎన్‌ఎంల్లో ఆందోళనరాష్ట్రంలో 2400 మంది ఎఎన్‌ఎంలు గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించారు.వీరిలో 1200 మంది ఎఎన్‌ఎంలకు వైసిపి సర్కారు ఇన్ సర్వీస్ కింద జిఎన్‌ఎం కోర్సు పూర్తి చేసినట్లు గుర్తించి జిఎన్‌ఎమ్‌లు ప్రమోట్ చేసింది. తాజాగా ఎన్డీయే సర్కారు నేషనల్ నర్సింగ్ ఏజెన్సీ గుర్తింపు అవసరమనే నెపంతో నిలిపేయడంతో నర్సుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ ఇటువంటి సమస్యలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదన వినిపిస్తోంది.