ప్రజాశక్తి-గుర్ల : తుపాను నేపథ్యంలో ధాన్యం తడవకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ సూచించారు. గుర్ల మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. కెల్ల రైతు సేవా కేంద్రం, పిఎసిఎస్ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఇంతవరకు జరిగిన ధాన్యం కొనుగోలు, చెల్లింపులపై ఆరా తీశారు. మిల్లులకు సరఫరా చేసిన గోనె సంచుల నాణ్యతను పరిశీలించారు. తుపాను ప్రభావంతో జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని, అందువల్ల రైతులు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలూ తీసుకొని, ధాన్యం తడవకుండా చూడాలని తెలిపారు. ఆయన వెంట వ్యవసాయశాఖ జెడి వి.తారకరామారావు, సివిల్ సప్లయిస్ డిఎం మీనాకుమారి, వ్యవసాయశాఖ ఎడి కోటేశ్వర్రావు, ఎఒ ఎ.తిరుపతిరావు, తాహశీల్దార్ ఆదిలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.