మడ్డువలస కాలువలో దూకి తల్లీపిల్లలు ఆత్మహత్యాయత్నం

Mar 11,2025 21:47

 తల్లి, కుమారుడిని కాపాడిన స్థానిక యువకుడు

గల్లంతైన బాలిక.. ముమ్మరంగా గాలింపు చర్యలు

ఆర్థిక ఇబ్బందులే కారణం

ప్రజాశక్తి-వంగర  : మండలంలోని మడ్డువలస కుడి ప్రధాన కాలువలోకి దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం మధ్యాహ్నం ప్రాజెక్టు ప్రధాన కాలువ హెడ్‌ స్లూయిస్‌కు దిగువ భాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బలిజిపేట మండలం గంగాడకు చెందిన కళింగ శ్రావణి(30), తన తొమ్మిదేళ్ల కుమారుడు సిద్ధు, ఏడేళ్ల కుమార్తె సైనీతో కలిసి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసమయంలో అటువైపు చేపల వేటకు వెళ్తున్న సంగార గ్రామానికి చెందిన జన్ని జగన్మోహన్‌ అనే యువకుడు వారిన చూసి వెంటనే కాలువలో దూకి శ్రావణిని, బాలుడు సిద్దును కాపాడి ఒడ్డుకు చేర్చాడు. వెంటనే వంగర పోలీసులకు సమాచారమిచ్చాడు. అప్పటికే కాలువలో కొట్టుకుపోయిన బాలికను కాపాడే ప్రయత్నం చేస్తుండగా… ఒడ్డుకు చేర్చిన మహిళ శ్రావణి తన కుమారుడిని తీసుకొని మళ్లీలో నీళ్లలో దూకింది. జగన్మోహన్‌ మళ్లీ వారిని రక్షించాడు. ఆ ప్రయత్నంలో బాలిక గల్లంతయ్యింది. వీరిని రెండోసారి రక్షించే ప్రయత్నంలో బాలికను రక్షించలేకపోయానని యువకుడు జగన్మోహన్‌ తెలిపాడు. భారీ లోతు ఉన్న కాలువలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నీళ్లలో దూకి తల్లీ, కుమారుడిని కాపాడిన జగన్మోహన్‌ను గ్రామస్తులు అభినందించారు. వంగర మండలం కింజంగి గ్రామానికి చెందిన గుంట తవుడు, కళావతి రెండో కుమార్తె శ్రావణి బలిజిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన కళింగ సుధాకర్‌ను పదేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సిద్ధు, సైనీ పుట్టిన తరువాత సుధాకర్‌ మానసిక స్థితి కోల్పోయాడు. పైగా వారిద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో శ్రావణి కింజంగి గ్రామంలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి ఐదేళ్లగా ఉంటోంది. కుమారుడు సిద్ధు ఉంగరాడ మెట్టవద్ద డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకులంలో ఐదో తరగతి చదువుతుండగా, సైనీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మూడు రోజుల క్రితం గరుగుబిల్లి మండలం బురద వెంకటాపురంలోని బంధువుల ఇంటికి పిల్లలతో కలసి వెళ్లిన శ్రావణి తన కుమారుడిని పాఠశాలకు తీసుకెళ్తున్నట్లు బంధువులకు చెప్పి మడ్డువలస ప్రధాన కాలువ వద్దకు తీసుకెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆర్థిక సమస్యలు వల్లే ఆత్మహత్యాయత్నం చేసుకొని ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్‌ ధర్మరాజుతో పాటు రాజాం అమ్మవారి జాతరబందోబస్తులో ఉన్న ఎస్‌ఐ షేక్‌ శంకర్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చి కాలువ హెడ్‌ స్లూయిస్‌ గేట్లు మూసివేయించారు. గత ఈతగాళ్లు, మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో బాలిక ఆచూకీ లభ్యం కాలేదు.

➡️