‘వందాడి’ ఇంటిపై దాడితో సంబంధం లేదు- టిడిపి అసెంబ్లీ అభ్యర్థి ‘మండిపల్లి’

ప్రజాశక్తి-చిన్నమండెం రాయచోటి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై జరిగిన దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదని టిడిపి అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిసిలతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ బిసిలపై దాడులు చేయదన్నారు. 20 ఏళ్లుగా భూ దందాలు, ఎర్రచందనం, డ్రగ్స్‌, స్మగ్లింగ్‌, వ్యవహారాలలో ప్రమేయం ఉన్న వ్యక్తి వండాడి వెంకటేశ్వర్లు అని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో అలజడులు సష్టించింది వైసిపి నేతలేనని చెప్పారు. ఆయన ద్వారా నష్టపోయిన వారే దాడికి పాల్పడితే ఆ నిందను మాపై మోపడం ఎంతవరకు సమంజసమన్నారు. ఓటమి భయంతోనే పోలీసుల సమక్షంలోనే టిడిపి ఏజెంట్లపై వైసిపి శ్రేణులు దాడులు జరిపారని తెలిపారు. సిఐ స్థాయి వ్యక్తిని అడ్డుపెట్టుకొని తెలుగుదేశం సానుభూతిపరులు, ఏజెంట్లపై ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి దాడులు చేయించారని ఆరోపించారు. 15 ఏళ్లురాయచోటి ప్రజలను మోసం చేస్తూ కేవలం తన రాజకీయ లబ్ధి కోసం అన్నదమ్ముల లాంటి హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్న వ్యక్తన్నారు. పోలీసులు, ఎన్నికల వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని మేము న్యాయపరంగా పోరాడుతామని తెలిపారు. రానున్నవి మంచి రోజులని కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సహనం పాటించాలాన్నారు. రాష్ట్రంలో, రాయచోటిలో రానున్నది తెలుగుదేశం విజయం సాధిస్తుందన్నారు. ‘మండిపల్లి’ గృహ నిర్భందం మండలంలోని పడమటికోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలో రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్భందం చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు పహారాకాస్తున్నారు. రాంప్రసాద్‌రెడ్డి గృహ నిర్భందం విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు గురువారం ఉదయం ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. గొడవలు జరగకుండా ఆయనను గృహ నిర్భందం చేశామని పోలీసులు చెబుతున్నారు. ‘వండాడి’ ఇంటిపై దాడి హేయం- ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, ప్రముఖ బిసి నాయకులు వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల తరువాత కొంతమంది ఉద్దేశపూ ర్వకంగా దాడులు చేయడం సరైందని కాదన్నారు. వండాడి వెంకటే శ్వర్లును పోలింగ్‌ రోజునే అసభ్యపద జాలంతో దూషించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. తరువాత కొంతమంది చిల్లర గ్యాంగులను పంపించి వారి ఇంట్లో కార్లు, ఫర్నీచర్‌ ద్వంసం చేయడం పిరికిపంద చర్య అని అన్నారు. ప్రస్తుతం రాయచోటి ప్రాంతంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేవిధంగా, పాత రోజులుకు తీసుకెళ్లే విధంగా కొన్ని అల్లరి గ్యాంగులు తయారవుతున్నాయని పేర్కొన్నారు. పట్టణంలో మైనారిటీలకు చెందిన మొనార్క్‌ ఫర్నీచర్‌ దుకాణాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదని, చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పిన తరువాత అందరినీ సంయమనం పాటించాలని కోరామన్నారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారని, ఇందులో ఎవరి పాత్ర ఉన్నావదలకుండా గట్టి చర్యలు తీసుకుని ప్రస్తుతం రాయచోటిలోఉన్న ప్రశాంతవాతావరణాన్ని కొనసాగించేలా పోలీసులు నడుం బిగించారన్నారు. ఇటువంటి చర్యలకు భవిష్యత్‌లో పాల్పడితే తమలోనూ ఓర్పు, సహనం, సన్నగిల్లి గట్టిగా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.

➡️