ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు : టిడిపి ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి

Jun 16,2024 15:09 #chandrababu, #Promises, #TDP MLA

ప్రజాశక్తి-పీలేరు (రాయచోటి-అన్నమయ్య) : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. పీలేరు నియోజకవర్గ ప్రత్యేక ప్రతిభావంతులైన దివ్యాంగుల సంఘ సభ్యులు ఆదివారం కలికిరిలో ఎమ్మెల్లే కిషోర్‌ కుమార్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో సన్మానించి సత్కరించారు. గత వైసిపి ప్రభుత్వ పాలకుల అక్రమాలను బయట పెడుతూ రాష్ట్రంలో ఎదురులేని నాయకుడిగా, నియోజకవర్గంలో తన ప్రత్యర్థిపై 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్లే కిషోర్‌ కుమార్‌ రెడ్డిని వారు కలసి అభినందించారు. కొలువు దీరిన కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, నిస్సహాయులైన ప్రత్యేక ప్రతిభావంతులను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేలు పెన్షన్‌ ను ఒకే సారి రూ.6 వేలకు పెంచిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు స్వస్తి పలికి, అరాచక పాలనను అంతమొందించి, దుర్మార్గపు పాలనను తరిమికొట్టి, రాజ్యాంగాన్ని ఏ మాత్రం గౌరవించని అసమర్థ పాలకుడిని ఓడించి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే సమర్ధుడైన చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గ ప్రత్యేక ప్రతిభావంతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పివి చలపతి, ప్రధాన కార్యదర్శి వెంకట రమణ, కార్యదర్శి పీలం లక్ష్మీ నారాయణ, సభ్యులు వెంకట రెడ్డి, నాగలక్ష్మి, భారతి, నాయుడు, గౌస్‌ బాష, మణి, ఖాదర్‌ బాష, తదితరులు పాల్గొన్నారు.

➡️