అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తాం : టిడిపి

Jun 10,2024 23:44

విలేకర్లతో మాట్లాడుతున్న కొమ్మాలపాటి శ్రీధర్‌ తదితరులు
ప్రజాశక్తి – నరసరావుపేట :
ఇప్పటివరకు రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయని, ఇక నుండి వెలుగుల ఆంధ్రప్రదేశ్‌ని అందరం చూస్తామని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు. స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతలు పర్యవేక్షణ కోసం ఇప్పటివరకు పోలీసులు బలంగా పనిచేశారని, పరిస్థితుల అదుపు కోసం చిన్న ఘటనలు జరిగినా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని చెప్పారు. జూన్‌ 12 నుండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పరిపాలన పేదల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని అన్నారు. మత్తు పదార్థాలు లేకుండా చేస్తామని, వైసిపి ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి పేదల ఆకలి తీరుస్తామని చెప్పారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తితోపాటు రాజధాని అమరావతి అభివృద్ధిని శరవేగంగా చేపడతామన్నారు. నూతన ప్రభుత్వంలో పవన్‌ కల్యాణ్‌ ముఖ్యపాత్ర పోషిస్తారని చెప్పారు. కార్యక్రమంలో నాయ కులు కె.కిరణ్‌, కె.విజయకుమార్‌, వి.నరసయ్య, ఆర్‌.జగ్గా రావు, డి.దాసరి ఉదయశ్రీ, జి.జనార్దన్‌బాబు పాల్గొన్నారు.
శరవేగంగా అమరావతి నిర్మాణం
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
చంద్రబాబు సంకల్పబలంతోనే అమరావతికి తిరిగి మంచి రోజులు వచ్చాయని, రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణం అతిత్వరలోనే పూర్తవుతుందని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక పండరిపురంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అమరావతి నవనగరాలతో నాడు రైతులకు చంద్రబాబు సిఆర్‌డిఎ తరఫున ఏం వాగ్దానం చేశారో అంతకు మించిన స్థాయిలో అమరావతి 2.0ను సిద్ధం చేస్తారని చెప్పారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, మండలాలలోని 29 గ్రామల పరిధిలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ ఏం నిర్మించాలనేది సిఆర్‌డిఎ బృహత్‌ప్రణాళికలో స్పష్టంగా ఉందన్నారు. వాటన్నింటి పూర్తితో దేశంలో అతిపెద్ద మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా సిఆర్‌డిఎ సరికొత్త చరిత్రను లిఖించబోతుందన్నారు. హైదరాబాద్‌ను మించిన అవకాశాల కేంద్రంగా అమరావతి అవుతుందని, ఇదే విషయాన్ని ప్రతిష్టాత్మక ఆర్కిటెక్చరల్‌ డైజెస్ట్‌ మ్యాగజైన్‌లోనూ ప్రస్తావించారని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన 6 భవిష్యత్‌ నగరాల్లో అమరావతి ఒకటిగా నిలవబోతుందని అందులో పేర్కొన్నారన్నారు. వైసిపి, జగన్‌ గ్రహణం తర్వాత ఇవాళ రాజధాని ప్రాంతంలో కలలకు కొత్తరెక్కలు వచ్చాయంటే అందుకు కారణం చంద్రబాబేనన్నారు.
జగన్‌ ముఠా మింగిన ప్రతి పైసానూ కక్కిస్తాం
ప్రజాశక్తి – వినుకొండ : అయిదేళ్లుగా అడ్డుఅదుపూ లేని దోపిడీతో జగన్‌రెడ్డి ముఠా మింగిన ప్రతిపైసా కక్కించి తీరతామని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. అవినీతి తేలేంతవరకూ తాడేపల్లి నుంచి బయటకు దారి తీసే ప్రతిమార్గంలో పోలీసులు నిశితంగా నిఘా పెట్టాలని కోరారు. తాడేపల్లి ప్యాలెస్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వైసిపి దొంగలు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారనే సమాచారం నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరన్నారు. ఇసుక, మద్యం సహా వైసిపి ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవినీతి, అక్రమాలపై సరైన రీతిలో విచారణలు జరిపించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. జ్యూడిషియల్‌ కమిషన్లు, ప్రత్యేకదర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి అందర్నీ బోనులో నిలబెట్టలని కోరారు. ముఖ్యంగా సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన విజరుకుమార్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్‌రెడ్డి సొంతపత్రికకు రూ.వందల కోట్ల ప్రకటనలు, డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఐప్యాక్‌, అనుకూల మీడియా సంస్థలు, వ్యక్తులకు అక్రమంగా మళ్లించిన రూ.వందల కోట్ల రూపాయల లావాదేవీలపై ప్రత్యేకదష్టి పెట్టాలని కోరారు.

➡️