టీచర్‌ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షెడ్యూల్‌ ప్రకటన

Sep 30,2024 21:50

 ప్రజాశక్తి-విజయనగరంకోట : టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబందించి ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. నవంబరు 6వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా ఎనిమిది పోలింగ్‌ కేంద్రాల మార్పునకు ప్రతిపాదిస్తున్నట్టు కలెక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ చెప్పారు. గజపతినగరంలో తమటాడ, కొత్తవలస మండలం మంగళపాలెంలో 3 కేంద్రాలు, వేపాడ మండలం డబ్బిరాజుపేటలో ఒకటి, రాజాం అసెంబ్లీ పరిధిలో వంగర మండలం లక్ష్మీపేట తదితర ఎనిమిది కేంద్రాల మార్పునకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. జిల్లాలో ఇంకా ఏవైనా కేంద్రాలు మార్పునకు రాజకీయ పార్టీలు ప్రతిపాదిస్తే వాటిని పరిశీలిస్తామని చెప్పారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణపై చర్చించారు. నవంబరు 9, 19, 23, 29 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు దినాలుగా గుర్తించి ఆరోజుల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌, డిఆర్‌ఒ ఎస్‌.డి.అనిత, ఆర్‌డిఒలు ఎ.సాయిశ్రీ, దాట్ల కీర్తి, ఎస్‌డిసిలు మురళీకష్ణ, జోసెఫ్‌, నూకరాజు, ప్రమీల తదితరులు, పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి

ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులంతా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని విశాఖపట్టణం జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌ సూచించారు. సోమవారం నుంచి ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమయ్యిందని నవంబర్‌ 6 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. నవంబర్‌ 23వ తేదీన దీనికి సంబంధించి డ్రాఫ్ట్‌ పబ్లిష్‌ అవుతుందని, 23 నుంచి డిసెంబర్‌ 09వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని చెప్పారు. అన్ని పరిశీలనల అనంతరం డిసెంబర్‌ 30వ తేదీన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని వివరించారు. విశాఖ కలెక్టరేట్‌ మీటింగు హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన వివిధ అంశాలపై సమీక్షించారు. పోలింగ్‌ కేంద్రాల క్రమబద్ధీకరణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఓటర్ల జాబితా నమోదు, ఇతర ప్రక్రియలపై చర్చించారు. ఎన్నికలో భాగంగా ఓటు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు సెకండరీ స్థాయికి (ఆరో తరగతికి పైబడి) మించిన పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీల్లో పని చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా అర్హులేనని చెప్పారు.

➡️