ఫొటో : మాట్లాడుతున్న అపస్ నాయకులు
ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి
ప్రజాశక్తి ఆత్మకూరు అర్బన్ : రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎపి ఉపాధ్యాయ సంఘం (ఆపస్) జిల్లా అధ్యక్షులు రాజగోపాలాచార్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ గత రెండు, మూడు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులకు మోక్షం కలిగి ఉండాలని కోరుతున్నామన్నారు. కనీసం ఆ బిల్లులు రద్దు చేయాలని కోరినా తిరస్కరించారన్నారు. 2023 జూలైతో ముగిసిన 11వ పిఆర్‌సి స్థానంలో 12వ పిఆర్‌సి కోసం కమిటీ ఏర్పాటు చేశారని, ఐఆర్ పరిస్థితి మాత్రం ప్రస్తావించలేదన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుండి రావాల్సిన చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. పాఠశాలలకు గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహణ నిధులు లేక అలమటిస్తున్నారని, పాఠశాలల్లో బోధనతో పాటు అనేక రకాలైన బోధనేతర విధులు నిర్వహిస్తూ ఉక్కిరబిక్కిరి అవుతున్న ఉపాధ్యాయులు ఒక్క నిమిషం పాఠశాలకు ఆలస్యమైన అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. వర్క్ అడ్జెస్ట్ మెంట్ పేరిటో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి కల్పించారని, ఎంటిఎస్ ఉపాధ్యాయులతో కూడా ఉన్నత పాఠశాలల్లో బోధించేలా చేస్తూ అత్యంత దూర ప్రాంతాలకు వర్క్ అడ్జెస్ట్ మెంట్ పేరుతో బదిలీ చేయడంతోవారి జీతభత్యాలు రవాణా ఛార్జీలకే సరి పోతున్నాయన్నారు. గత ప్రభుత్వం అట్టహాసంగా మొదలుపెట్టిన హైస్కూల్ ప్లస్‌లలో విద్యార్థులు లేక అనేక పాఠశాలలు మూతపడ్డాయని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 250 హైస్కూల్ ప్లస్ పాఠశాలలని కొనసాగిస్తున్నరాని, అయితే ఉపాధ్యాయుల నియామకాలు లేక ప్రధానోపాధ్యాయులే బోధన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఈ విషయమై ఆలోచించి నష్టనివారణ చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యోగ ఉపాధ్యాయులలో ఆందోళన తీవ్రతరమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.