జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో ఉత్సాహంగా ఉపాధ్యాయులు

Sep 30,2024 00:43

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలోని డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు ఆదివారం నిర్వహించారు. 200 మందికిపైగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ చాటారు. పోటీలను నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ప్రారంభించగా ఎమ్మెల్సీ కె.ఎస్‌ లక్షణరావు మాట్లాడుతూ సామాజిక సేవాభావంలో యుటిఎఫ్‌ ఘన కీర్తి కలిగి ఉందని చెప్పారు. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రతినిత్యం సమాజంలో ఉపాధ్యాయుల గౌరవం పెంచే స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, జి.విజయసారధి మాట్లాడుతూ విద్యావ్యవస్థలో వినూత్న సంస్కరణలు తెచ్చేందుకు విద్యా సదస్సుల ద్వారా చర్చించి సమగ్ర నివేదికలు ప్రభుత్వానికి యుటిఎఫ్‌ సమర్పిస్తోందన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యా వ్యవస్థను సక్రమంగా నడపాలని తాపత్రయపడే ఎంతోమంది నాయకులు కలిగిన యుటిఎఫ్‌ సమాజంలో అత్యంత బాధ్యతాయుత పాత్ర పోషిస్తోందన్నారు. ఇదిలా ఉండగా జిల్లా స్థాయి పోటీల్లో విజేతలకు వచ్చే నెల 4, 5 6 తేదీల్లో గుంటూరు ఎన్‌.టి.ఆర్‌ స్టేడియంలో రాష్ట్రస్థాయిలో పోటీలు ఉంటాయని చెప్పారు. ఇటీవల పోటీల్లో విజేత లకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు బహుముతుల ప్రదానం చేశారు.

➡️