పల్నాడు జిల్లా మాచర్ల మండలం కంభంపాడులో లబ్ధిదార్ల వివరాల సేకరణలో బృందాలు
ప్రజాశక్తి- మాచర్ల రూరల్/చేబ్రోలు : సామాజిక పింఛన్ల తనిఖీల్లో భాగంగా గుంటూరు జిల్లా వేజెండ్ల, పల్నాడు జిల్లా కంభంపాడు గ్రామాల్లో సోమవారం అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించారు. పైలట్ ప్రాజెక్టుగా రెండు గ్రామాల్లో పరిశీలన చేపట్టారు. అనర్హుల ఎరివేత పేరుతో వివిధ అంశాలపై సమాచారం నమోదు చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం కంభంపాడు సచివాలయం-2 పరిధిలోని వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్లను పరిశీలన చేశారు. ఈ సచివాలయం పరిధిలో 505 మంది లబ్ధిదార్లున్నారు. ఎంపిడిఒ ఫణికుమార్ నాయక్ సూపర్‌వైజర్‌గా డిఎల్‌డిఒ గభ్రూనాయక్ ఆధ్వర్యంలో సచివాలయం పరిధిని 20 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్ కింద ఇద్దరు అధికారులకు 40 పింఛన్లు తనిఖీ బాధ్యతలు అప్పగించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన అధికారులు గ్రామంలో తనిఖీలు చేపట్టారు. వారి ఫోన్ యాప్‌లో ఉన్న ప్రశ్నావళి ప్రకారం లబ్ధిదారులు నుంచి వివరాలు సేకరించి, ఆధార్ కార్డు, వికలాంగుల సర్టిఫికెట్ తదితర పత్రాలను పరిశీలించి యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఎంపిడిఒ ఫణికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం తనిఖీ జరుగుతుందన్నారు. తొలిరోజు సచివాలయం పరిధిలో 87 శాతం పింఛన్ల తనిఖీలు పూర్తి చేశామన్నారు. మరికొందరు అందుబాటులేరని వారి వివరాలు మంగళవారం సేకరిస్తామని తెలిపారు. పింఛన్లు తనిఖీ చేసినవారిలో అధికారులు పద్మజ, వెంకటేశ్వర్లు, వెంకటేష్, సురేష్ తదితరులున్నారు.గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్లలో 600 పింఛన్లను పరిశీలించారు. బృందానికి ఇద్దరు చొప్పున అధికారులు 16 బృందాలుగా 32 మంది పరిశీలనలో పాల్గొన్నారు. లబ్ధిదార్ల కుటుంబీకుల్లో ఎవరికైనా నెలకు ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12 వేలలలోపు ఉందా? లేదా? మాగాణి మూడెకరాలకు మించి, మెట్టయితే పదెకరాలకు మించి, మెట్ట, మాగాణి కలిపి పదెకరాలకు మించి ఉన్నా, నాలుగు చక్రాల వాహనం ఉన్నా (టాక్సీ, ట్రాక్టర్ , ఆటో కాకుండా), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్ వున్నా , ఎక్కువ విద్యుత్ వినియోగం ఉన్నా (12 నెలలు సగటున 300 యూనిట్లు పైన), పట్టణంలో ఆస్తులున్నా (మున్సిపాలిటీల్లో 1000 చదరపు అడుగులు నిర్మాణం), ఆదాయపు పన్ను చెల్లిచడం లాంటి ప్రభుత్వం నిర్దేశించిన అంశాలను లబ్ధిదార్ల నుండి అడిగి తెలుసుకొని అవునా? కాదా? అనే వివరాలను వెరిఫికేషనులో పరిశీలించి ఆ వివరాలను యాప్‌లో నమోదు చేశారు. వికలాంగులకు సంబంధించి ధ్రువపత్రాలు పరిశీలించి అవసరమైతే మరోసారి ధ్రువపత్రాలు పొందాల్సి ఉంటుందని అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. వితంతువుల్లో మళ్లీ వివాహం చేసుకున్నారా? లేదా? అని పరిశీలించారు. చేనేత కార్మికులు, డప్పుకళాకారులు స్థానికంగా వృత్తుల్లో ఉన్నారా? లేదా? అని పరిశీలించారు. అనంతరం లబ్ధిదారుని స్వచ్ఛంద అనుమతితో వెరిఫికేషన్ పూర్తి చేసినట్టు వారి నుంచి అంగీకారం తీసుకున్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ అధికారి విజయలక్ష్మి , డిఎల్‌డిఒ శ్రీదేవి, ఎంపిడిఒ కె లలిత , ఎపిఒ లక్ష్మీ పాల్గొన్నారు.
