ప్రజాశక్తి – పీలేరు: క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నదే సివిల్ రైట్స్ డే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పీలేరు తహశీల్దారు ఎం. భీమేశ్వర రావు తెలిపారు. శుక్రవారం పీలేరు పట్టణంలోని లక్ష్మీపురంలో తహశీల్దారు అధ్యక్షతన సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు ప్రజలను అడిగి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ లక్ష్మీపురంలో షెడ్యూల్ కులాలకు చెందిన సుమారు 150 గృహాలు ఉన్నాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉందని అన్నారు. అయితే ఇక్కడ ఎవరికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడంలేదని, విద్యుత్ బిల్లులు అధిక మొత్తంలో వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. మురుగునీటి కాలువలు కూడా తగినన్ని లేవని, ముఖ్యంగా తమ కోసం ఒక ప్రత్యేక చౌక దుకాణం, స్మశాన వాటిక అవసరం ఉందని అధికారుల దృష్టికి తెచ్చారు. అలాగే తహశీల్దారు అక్కడి ప్రజల నుంచి వ్యక్తిగత సమస్యలను కూడా స్వీకరించారు. ప్రజలు, ప్రజా సంఘాల నాయకుల నుంచి అందిన విన్నపాలపై ఆయన స్పందిస్తూ చౌక దుకాణం ఏర్పాటుకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన డ్వాక్రా మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు తెలియపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు సుబ్రమణ్యం, మండల విద్యాశాఖ అధికారులు లోకేశ్వర్ రెడ్డి, పద్మావతి, ఈఓపీఆర్డి లతీఫ్ ఖాన్, పంచాయతీ ఈఓ గురు మోహన్, అదనపు ఎస్ఐ లోకేష్, విఆర్ఓ ఇబ్రహీం, ఇతర రెవెన్యూ సిబ్బందితో పాటు ప్రజాసంఘాల నాయకులు గండికోట వెంకటేష్, సుధాకర్ బాబు, ధరణి కుమార్, మల్లికార్జున, సుభాష్, ప్రజలు పాల్గొన్నారు.