స్టీల్‌ప్లాంట్‌లో తెలుగు అధికారులను నియమించాలి : విదసం

Feb 4,2025 23:56 #Vidasam press meet
Vidasam press meet

 ప్రజాశక్తి-సీతమ్మధార : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం, ప్రాణ త్యాగం అర్థం తెలిసిన తెలుగు అధికారులను విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో నియమించాలని విదసం ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమను తిరిగి నిలబెట్టడానికి సిఎమ్‌డితో సహ కీలకమైన ఆపరేషన్‌, కమర్షియల్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్లను తెలుగు వారినే నియమించేలా చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. అంబేద్కర్‌భవన్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ బూసి వెంకటరావు మాట్లాడుతూ, త్యాగాలతో వచ్చిన స్టీలుప్లాంట్‌ గురించి తెలిసిన తెలుగు సిఎమ్‌డి మాత్రమే కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని సమర్థంగా వినియోగించి పరిశ్రమను పంరుజ్జీవింప చేయగలరని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతీసుకుని కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. ప్రకటించిన ప్యాకేజీ సొమ్మును బాధ్యత లేని అధికారులు చేతిలో పెడితే లక్ష్యం నెరవేరదన్నారు. ఇప్పుడున్న సిఎమ్‌డి, ఇతర ఉత్తరాది రాష్ట్రాల డైరెక్టర్లకు విశాఖ ఉక్కు పోరాట త్యాగాలు తెలియవన్నారు. ప్యాకేజీ నిధుల నుంచి ముడి సరుకు కొనుగోలుకు, కార్మికుల జీతాలు చెల్లింపునకు అనుమతి కోరాలని కోరారు. విద్యుత్‌, నీటి చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని, మాదారం, జగ్గయ్య పేటల్లో జరిగే మైనింగ్‌పై రాయల్టీ వాయిదా వేయాలని, కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపు నిలిపి వేసి నిర్వాసితులకు ఉపాధి భరోసా కల్పించాలని ముఖ్యమంత్రికి ఉత్తరం రాసినట్లు తెలిపారు. ప్లాంటు స్థితిగతులపై ముఖ్యమంత్రి నేతృత్వంలో మూడు నెలలకోసారి సమీక్ష చేసి యాజమాన్యానికి సలహా మండలిగా ఉండాలని కోరారు. పోలవరం, అమరావతి, పిఎంఎవై నిర్మాణాలకు విశాఖ ఉక్కునే కొనుగోలు చేయాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకణ జరగదని ప్రధాని మోడీచే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సోడదాసి సుధాకర్‌, జాజీ ఓంకార్‌, గొల్లమాల అప్పారావు, గుడాల ఈశ్వరరావు, బూల భాస్కరరావు, రాజేంద్రప్రసాద్‌, రవిశేఖర్‌, రవి, సంతోష్‌ పాల్గొన్నారు.

➡️