కడప కార్పొరేషన్ పరిధిలో ‘చెత్త’ రాజకీయం రోత పుట్టిస్తోంది. రాష్ట్రంలో అధికార టిడిపి, కడప కార్పొరేషన్ పాలిత వైసిపి మధ్య చెత్త తొలగింపు వ్యవహారం రాజకీయమైంది. ప్రభుత్వం 30 చెత్త తరలింపు వాహనాలను కుదించడమే చెత్త రాజకీయ దుమారానికి కారణం కావడం గమనార్హం. చెత్త తొలగింపు వాహనాలను రద్దు చేయడాన్ని నిరోధించాలి. లేదా చెత్త తొలగింపు వాహనాలకు పన్ను చెల్లింపు మార్గాన్ని అన్వేషించాలి. ఇటువంటి రెండు మార్గాలను అన్వేషించకుండా కార్పొరేషన్ పాలకవర్గంపై బెదిరింపు తరహా విమర్శలు చేయడం సిగ్గుచేటు. కడప టిడిపి ఎమ్మెల్యే కార్పొరేషన్ పాలకవర్గంపై విమర్శలు చేశారు. చెత్తను తొలగించకపోతే మేయర్ ఇంట్లో చెత్త వేయాలని విమర్శలు చేయడం వరకు పర్వాలేదు. చెత్తను తీసుకెళ్లి మేయర్ ఇంటి ముంగిట చెత్త వేయడం చౌకబారుతనానికి నిదర్శనమనే చెప్పాలి. వైసిపి జిల్లా నాయకత్వం స్పందించి మేయర్ ఇంట్లో చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కలిస్తే బెదిరింపు రాజకీయం చేయడం జుగుప్సను కలిగిస్తోంది. ప్రభుత్వం చేతిలో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం కార్పొరేషన్ పాలకవర్గాన్ని రద్దు చేసే అవకాశం ఉందనే తరహాలో బెదిరింపులకు దిగడం దారుణం. తెంపరితనం ప్రజాస్వామ్యంలో మనలేదనే సంగతిని గ్రహించాలి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముంగిట టిడిపి అధికారంలోకి వస్తే చెత్త పన్ను వసూలు చేయబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటువంటి హామీకి కట్టుబడి రాజకీయం చేయాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను ప్రత్యర్థి పార్టీకి చెందిన పాలకవర్గం అమలు చేయాలని కోరడం దివాళాకోరుతనానికి నిదర్శనం కాదా అని ఆలోచించాలి. టిడిపి అధికారంలోకి వచ్చిన వంద రోజులు ముగియకముందే ఇటువంటి తరహా రాజకీయం చేస్తే మిగిలిన నాలుగున్నరేళ్లు కడప అసెంబ్లీలో ఎటువంటి రాజకీయం నడవనుందో ఇట్టే తెలిసిపోతోందనే విశ్లేషణలు వినిపిస్తుండడం గమనార్హం. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి, ఎన్నికల అనంతరం సమాజ అభివృద్ధి, పేదల సంక్షేమం, పాలనలో పారదర్శ కత, జవాబుదారీ తనం ఉండేలా పాలన సాగేలా చూడాలి. కార్పొరేషన్ పాలనలో ఎక్కడైనా తప్పులు దొర్లితే నిలదీయాలి, సరిచేయాలి, కానీ ఇటువంటి తరహా చెత్త రాజకీయాన్ని ప్రజలు హర్షించరనే సంగతి గ్రహించి మసలుకోవాలి. కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య, పారిశుధ్యం, లోతట్టు ప్రాంతాల ముంపు సమస్య, బుగ్గవంక సుందరీకరణ, సర్కిళ్ల అభివృద్ధి వంటి ఎన్నో సమస్యల పరిష్కా రానికి ఆలోచనలు సాగించాలి. ఇటువంటి ప్రజల సమస్యల పరిష్కారం చేయకుండా రాష్ట్రంలో అధికార పార్టీ కుదించిన 30 చెత్త వాహనాలకు పన్ను చెల్లింపు చేయడం ఎలా, కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నిధుల్లో సర్దుబాటు చేయడానికి ఒప్పించాలి, అది కుదరకపోతే ప్రభుత్వం నుంచి అదనపు నిధులు తెప్పించి, అందులో నుంచి ఖర్చు చేయడమా అనే ఆలోచనలు సాగించాలి. వైసిపి హయాంలో సాగిన కడప నగర అభివృద్ధిని మరిపించేలా అభివృద్ధి, సంక్షేమాన్ని ఎలా చేయాలా అనే ఆలోచనలు చేయాలి. ఇటువంటి ఆలోచనలు చేయకుండా, కేవలం ప్రత్యర్థులను బెదిరించడం ఎలా అనే తరహా రాజకీయం వికటించే ప్రమాదం పొంచి ఉందనే సంగతిని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు. – ప్రజాశక్తి – కడప ప్రతినిధి
