పకడ్బందీగా ‘పది’ పరీక్షలు : కలెక్టర్‌

ప్రజాశక్తి- కడప అర్బన్‌ ఈ నెల 17 నుంచి 31వ వరకు పదవ తరగతి పరీక్షలు పకడ్బందీ, భద్రతతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్‌ హాల్‌లో పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలో 161 పరీక్షా కేంద్రాలలో 14,330 మంది బాలురు, 13,470 మంది బాలికలు మొత్తం 27,800 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్‌ భద్రతను కల్పించాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇంటర్నెట్‌, జిరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని, పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులు, ఇన్విజి లెటర్స్‌ , ఇతర ఉన్నత అధికారులతో సహా ఇతర సిబ్బంది ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు వెంట తీసుకువెళ్లారాదన్నారు. పోలీస్‌ సిబ్బంది ముందస్తుగానే తనిఖీ చేయాలన్నారు. ఎక్కడ మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలన్నారు. అంతరాయం లేని నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, లైట్‌లు, ఫాన్స్‌, ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల కు అంతరాయం కలుగకుండా ఆర్‌టిసి బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరీక్షా కేంద్రాల వద్ద ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పోస్టల్‌ శాఖవారు పరీక్షా పత్రాలను పరీక్షా కేంద్రాలకు భద్రత తో అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో జెసి అదితిసింగ్‌, కడప, బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగు ఆర్‌డిఒలు జాన్‌ ఇర్వీన్‌, చంద్రమోహన్‌, చిన్నయ్య, సాయిశ్రీ, తహశీల్దార్లు, విద్యా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.’మొల్ల’ రామాయణం రమణీయం సరళమైన తెలుగు భాషలో రామాయణం రచించి సమాజానికి అందించిన గొప్ప కవియత్రి మొల్లమాంబ అని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌ లోని సభా భవన్‌ హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన శ్రీ మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సాహితీవేత్త నరాల రామారెడ్డి, మొల్ల సాహితీ పీఠం అధ్యక్షులు డాక్టర్‌ విద్వాన్‌ గానుగపెంట హనుమంత రావు హాజరయ్యారు. సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రామాయణ మహా గ్రంథాన్ని పలువురు వివిధ భాషలలో రచించారని చెప్పారు. వాల్మీకీ లాంటి మహనీయులు రచించిన రామాయణ గ్రంథాలను ఆధారం చేసుకుని మొల్లమాంబ తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యే తెలుగు భాషలో మొల్ల రామాయణాన్ని సరళంగా రాయడం గర్వించదగ్గ విషయమన్నారు. బద్వేలు వద్ద గల గోపవరం గ్రామానికి చెందిన మొల్ల రామాయణాన్ని అతి తక్కువ పద్య గద్యాలతో అత్యంత సులువమైన శైలిలో తనదైన ముద్రతో రచించి నాటి పండిత పామరుల ప్రశంసలు పొందారన్నారు. చాపాడు(మైదుకూరు) : కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా మైదుకూరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు కవయిత్రి మొల్ల చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి మాట్లాడుతూ కవుల గడపగా పేరొందిన కడప జిల్లా బద్వేలు దగ్గర గోపవరంలో కవయిత్రి మొల్ల జన్మించడం జిల్లా ప్రజల అదష్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిసి సెల్‌ అధ్యక్షులు నేట్లపల్లి శివరామ్‌, వైసిపి నాయకులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, జడ్‌పిటిసి సుబ్బారెడ్డి, బిసి నాయకులు ఓబయ్య, బిసి సెల్‌ జిల్లా కార్యదర్శి బతల సుబ్బారాయుడు, వైస్‌ చైర్మన్‌ మూలే భరత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ షరీఫ్‌, ఎ.సి.కె. రమణ, సుధాకర్‌, పిల్లి నాగయ్య, భూమిరెడ్డి సుబ్బారాయుడు, వెంకట సుబ్బన్న రఘురామయ్య,వైసీపీ జిల్లా జాయింట్‌ సెక్రటరీ రవిశంకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️