ప్రజాశక్తి-బాపట్ల : జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం పురుషోత్తం ఆదివారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా పది పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా విద్యార్థులు చేరుకోవాలన్నారు. జిల్లాలో 103 పరీక్షా కేంద్రాల్లో 16,799 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని డీఈఓ వివరించారు. 8482 విద్యార్థులు, 8317 మంది విద్యార్థినులు పది పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు సౌకర్యం కల్పించామన్నారు. బస్సులు విద్యార్థులను పరీక్షా కేంద్రాల వద్దకు చేర్చే విధంగా ఆర్టిసి అధికారులతో సంప్రదించి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జిరాక్స్ షాప్‌లు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి విద్యార్థి హాల్ టికెట్‌పై ఆర్‌టీసి బస్‌లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదన్నారు. చీఫ్ సూపరింటెండెంట్‌కు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి ఉందన్నారు. ఆ ఫోన్లో కెమెరా ఆన్ చేయకూడదన్న నిబంధనలు ఉన్నాయన్నారు.12 పరీక్షా కేంద్రాలు బాపట్లలో 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఈవో తెలిపారు. పట్టణంలో రవీంద్ర భారతి స్కూల్, సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల, కొండు బొట్ల పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏవీవీ ఉన్నత పాఠశాల, లిటిల్ ఏంజిల్స్ ఉన్నత పాఠశాల, నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూలు, బాపట్ల హైస్కూలు, శ్రీ చైతన్య హైస్కూలు, మునిసిపల్ హై స్కూలు, ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాల, అప్పికట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెరువు జమ్ములపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఈవో తెలిపారు.
