ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్య) : పెద్దతిప్ప సముద్రం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తంబళ్ళపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జయ చంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని తెలుగుదేశం కార్యకర్తల అడ్డుకుంటారని ముందస్తుగా ఐదు గంటలకే ఎంపీడీవో కార్యాలయంలోకి వెళ్లి వైసిపి ఎంపీటీసీ సభ్యులు తాళాలు వేసుకున్నారు. వైసిపి ప్రభుత్వంలో వీరంతా దొంగచాటున ఎంపీటీసీలయ్యారనీ, ప్రజల చేత ఎన్నుకోబడిన వారు కాదని వీరు ఎంపీటీసీ సభ్యులుగా అనర్హులని వీరందరూ వెంటనే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి ప్రజల చేత ఎన్నుకోబడి మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని లేనిపక్షంలో ఈ సర్వసభ్య సమావేశాన్ని ఎప్పుడు అడ్డుకుంటామని టిడిపి శ్రేణులు హెచ్చరించారు. గత ప్రభుత్వంలో అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికలు జరపకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఏకగ్రీవం చేసి ఎంపీటీసీలుగా ఎన్నుకోవడం పై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ ఎంపీటీసీ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.
