ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఎన్నికలు బుధవారానికి వాయిదాపడ్డాయి. ఓటింగ్ కోసం వచ్చిన తమపై కూటమి నేతలు దాడి చేశారని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. కార్పొరేటర్లు వస్తున్న బస్సుపై కూటమి నేతలు దాడి చేసి తమను అడ్డుకున్నారని చెప్పారు. బస్ టైర్లకు గాలి తీసేసి, తాళాలు లాక్కుని తమ కార్పొరేటర్లను బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారన్నారు. అయినప్పటికీ పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఎంపీ ఆరోపించారు. ఉద్రిక్తతల నడుమ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలను అధికారులు బుధవారానికి వాయిదా వేశారు. వైసిపి కార్పొరేటర్లు చాలామంది కిడ్నాప్ గురి కావడం, ఓటింగ్‌కు రానివ్వకుండా కూటమి ప్రభుత్వం నేతలు అడ్డుకోవడంతో ఎన్నికలు ఆగాయి. సహజంగా 26 మంది కార్పొరేటర్లు ఉంటే ఎన్నికలు జరుగుతాయి. కానీ కేవలం 23 మంది మాత్రమే కార్పొరేటర్లు ఉండడం వల్ల డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదాపడ్డాయి.
