Tension – విశాఖలో ఉద్రిక్తత – వామపక్ష నేతలు అరెస్ట్‌ – ఫోటోలు

విశాఖ : విశాఖలో వామపక్షాలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేయకూడదని డిమాండ్‌ చేస్తూ … బుధవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విశాఖ జిల్లా మద్దిలపాలెం దగ్గర నిరసన చేపట్టారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను అమ్మే నిర్ణయాన్ని రద్దు చేయాలని, ప్లాంట్‌కు స్వంత గనులను కేటాయిస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డగించడంతో తోపులాట జరిగింది. నిరసనకారులను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు వ్యాన్‌లలో పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.గంగారావు, ఆర్కే ఎస్‌ వి కుమార్‌, పి.మణి, కృష్ణారావు, సిపిఐ నాయకులు పైడ్రాజు, విమల పాల్గొన్నారు.

గత రాత్రి నుండే అరెస్టులు..
గత రాత్రి నుండే విశాఖ, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా సిపిఎం, సిపిఐ నాయకులను గఅహనిర్భంధాలు చేసి పోలీస్‌ స్టేషన్లలో కస్టడీలో ఉంచారు. ఈ అక్రమ అరెస్టులను సిపిఎం 78 వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడి రాజు తీవ్రంగా ఖండించారు. మోడీకి దాసోహం అయ్యి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు కూటమి ప్రభుత్వం తీవ్ర ద్రోహం తలపెట్టిందని విమర్శించారు. ఆర్సీ లార్‌ మిట్టల్‌ కు దొడ్డిదారిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు కట్టబెట్టాలని కుట్ర చేస్తున్నారని, వెంటనే ఈ దుర్మార్గాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అరెస్టు అయినవారిలో సిపిఎం 78 వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగా రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడి రాజు తో పాటు సిపిఎం నాయకులు అర్‌ కే ఎస్‌ వి కుమార్‌, బి జగన్‌, బట్టా ఈశ్వరమ్మ, పీ మణి, వి.కృష్ణారావు, ఎం సుబ్బారావు, డి, అప్పలరాజు, సిపిఐ నాయకులు ఎ. విమల, కె.సత్యనారాయణ, రెహ్మాన్‌, శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, పీ మన్మదరావు, పీ గోవింద్‌ , ఎపిఎఫ్‌టియు నాయకులు దేవ తదితరులు మొత్తం 90 మందికి పైగా ఉన్నారు.

➡️