నిబంధనలు బ్లాస్ట్‌

Feb 2,2025 21:13

 అడ్డగోలుగా క్వారీ పేలుళ్లు

నరకయాతన పడుతున్న స్థానికులు

చూసీ చూడనట్లు ఉన్నతాధికారులు

ప్రజాశక్తి – జామి :  బ్లాస్టింగ్‌ అన్న పేరు వింటేనే గుండె జల్లుమంటుంది. ఇక బ్లాస్టింగ్‌ నిర్వహణ అంటే ప్రాణాలతో చెలగాటమే. కానీ జామి మండల కేంద్రంలో బ్లాస్టింగ్‌ అనేది దీపావళి సీమ టపాసులు కాల్చినంత సులువు. ఇదేంటి అనుకుంటున్నారా..? నిజమేనండి! జామిలోనే కాదు.., జిల్లాలోనే క్వారీ బ్లాస్టింగులు విచ్చలవిడిగా సాగిపోతున్నాయి. అనుమతులు లేకుండా కొందరు, కాగితాల్లోనే అరకొర లైసెన్సులు ఉన్నట్లు చూపించి మరికొందరు… ఇలా నిబంధనలను బ్లాస్ట్‌ చేసేస్తున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి చూస్తే, నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. జిల్లాలో సుమారుగా 200కు పైగా రోడ్డు మెటల్‌ క్వారీలకు మైనింగ్‌ శాఖ ద్వారా ప్రభుత్వం లీజులు మంజూరు చేసింది. ఇందులో కొన్ని లీజులు రద్దు కాగా, కొన్ని లీజులు మనుగడలో ఉన్నాయి. జామి మండల కేంద్రంలో క్వారీ లీజులను పరిశీలిస్తే, సర్వే నెంబర్‌ 394లో హెక్టారుకు గానూ 2017లో 15 ఏళ్ల కాలానికి ప్రభుత్వం లీజు మంజూరు చేసింది. బ్లాస్టింగ్‌ చేయడానికి గానూ పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (పిఇఎస్‌ఒ) నుంచి ఒకరు బ్లాస్టింగ్‌ లైసెన్సు (2025 మార్చి 31 వరకు గడువు) పొందారు. కానీ బ్లాస్టింగ్‌ నిర్వహించడానికి ఎక్స్‌ప్లోజివ్‌ రూల్స్‌ 2008 ప్రకారం షాట్‌ ఫైరర్‌ పర్మిట్‌ పొందిన లైసెన్స్‌ బ్లాస్టర్‌ ఉండాలి. కాబట్టి 2016లో క్లాస్‌ – బి కేటగిరీ (భూమిపై భాగంలో మాత్రమే బ్లాస్టింగ్‌ అధికారం) లైసెన్సు పొందారు. దాని గడువు 2026 ఆగస్టు 18తో ముగుస్తోంది. ఇలా లైసెన్సులు పొందినప్పటికీ బ్లాస్టింగ్‌కు 200 మీటర్లను డేంజర్‌ జోన్‌గా బౌండరీ ఏర్పాటు చేసి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ ప్రకారం పర్యావరణం దెబ్బతినకుండా బ్లాస్టింగ్‌ నిర్వహిం చాలి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా, భూమి నుంచి 50 అడుగుల లోతు వరకు రంధ్రం పెట్టి బ్లాస్టింగులు నిర్వహిస్తున్న పరిస్థితి. జాతీయ రహదారి నిర్మాణ (పిఎస్‌కె) సంస్థ ఒక బినామి పేరిట సర్వే నంబర్‌ 464లో 2 హెక్టార్లు మైనింగ్‌కు లీజు పొందింది. వీరైతే ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి (క్లాస్‌-బి) షాట్‌ ఫైరర్‌గా కాగితాల్లో చూపించి సాధారణ వ్యక్తులతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా లక్షలాది టన్నుల మైనింగ్‌ చేస్తున్నారు. మరో విచిత్రం ఏమిటంటే వీరికి ఎక్స్‌ప్లోజివ్‌ గోడౌన్‌ నెల్లిమర్ల మండలం టెక్కలి గ్రామంలో ఉన్నట్లు కాగితాల్లో చూపిస్తున్నారు. ఇక లైసెన్సులు లేని వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. ఒక్క జామి గ్రామంలో మాత్రమే కాదు. జిల్లా వ్యాప్తంగా అడ్డగోలు బ్లాస్టింగులు నిర్వహిస్తున్నా, పోలీసులు, బ్లాస్టింగును పద్ధతి ప్రకారం నిర్వహించాల్సిన పర్యావరణ అధికారులు పట్టించుకునే పాపాన పోవడం లేదు. ప్రజా ఫిర్యాదులు బుట్టదాఖలు జామి మండల కేంద్రంలో మాధవరాయమెట్ట చుట్టూ ఉన్న క్వారీల్లో విచ్చలవిడిగా పేలుళ్లు నిర్వహించడంతో కాలనీ ఇళ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని అనేక దఫాలు అధికారులకు వినతులు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగ్‌ సమయాల్లో పోలీస్‌స్టేషన్‌, ఎంఆర్‌ఒ కార్యాలయ భవనాలు కూడా బీటలు వారుతున్నా వారికి పట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా వద్ద ఫైల్స్‌ లేవే లేవు

జిల్లాలో బ్లాస్టింగులకు సంబంధించిన లైసెన్సుల ఫైల్స్‌ ఇవ్వాలని జామి గ్రామానికి చెందిన ఓ న్యాయవాది రాసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు అటువంటి ఫైల్స్‌ లేవని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం బదులు ఇవ్వడం గమనార్హం. గనుల శాఖ కూడా తమ వద్ద సమాచారం లేదని చెప్పడం విశేషం.

మాకు సంబంధం లేదు

క్వారీ బ్లాస్టింగుల అంశం గనుల శాఖ చూస్తోంది. మా శాఖకు ఎటువంటి సంబంధమూ లేదు. లైసెన్సులు కూడా మా పరిధి కాదు.

– సరిత, పర్యావరణ ఇంజినీర్‌, కాలుష్య నియంత్రణ మండలి

మాకూ సంబంధం లేదు

క్వారీల్లో బ్లాస్టింగులను పర్యవేక్షించే బాధ్యత మాది కాదు. మాకు తెలిసి గనుల శాఖ దీనిని చూస్తుంది. కాబట్టి దీనిపై ఏమీ చెప్పలేం.

– వకుల్‌ జిందాల్‌, ఎస్‌పి

➡️