తంబళ్లపల్లె టిడిపిలో భగ్గుమన్న విభేదాలు

ప్రజాశక్తి-బి.కొత్తకోట తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎక్కడైనా ప్రత్యర్థి పార్టీ నాయకత్వం నాయకులు, కార్యకర్తలు గొడవ పడడం సర్వసాధారణం. తంబళ్లపల్లి నియోజకవర్గంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆదివారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బి.సి.జనార్ధన్‌రెడ్డి సమక్షంలోనే టిడిపి నాయకులు తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. హార్సిలీహిల్స్‌లో నిర్వహించిన తంబళ్లపల్లి నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ సమావేశం రసాభాసగా మారింది. మంత్రి జనార్దన్‌రెడ్డి ఎదుటే కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. తంబళ్లపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన జయచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌ మధ్య రాజకీయ గ్రూపు పోరు తార స్థాయికి చేరడంతో వారి అనుచరులు ఘర్షణకు దిగారు. నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని శంకర్‌ అనుచరులు నినాదాలు చేశారు. వైసిపి నుంచి వచ్చిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నారని పార్టీకి పని చేసిన వారికి కనీస మర్యాద దక్కలేదని వాపోయారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఘర్షణలో పిటిఎం మండలం మాజీ జడ్‌పిటిసిపై దాడి జరిగింది. పోలీసుల జోక్యం చేసుకొని గొడవ సద్దుమణిగేందుకు ప్రయత్నించారు. సమావేశం రసాభాసగా మారడంతో మంత్రి జనార్దన్‌రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్‌రాజు సమీక్షను అర్థాంతరంగా ముగించారు. వివరాలలోకి వెళితే… కార్యకర్తలతో మండలాల వారీగా మంత్రి జనార్దన్‌రెడ్డి సమావేశం నిర్వహిస్తుండగానే బయట మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌ వర్గీయులు, జయచంద్రారెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అనంతరం పూర్తిస్థాయి సమావేశం నిర్వహించకుండానేమంత్రి జనార్దన్‌రెడ్డి, సీడ్‌ యాప్‌ చైర్మన్‌ దీపక్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రాజు వెనుదిరిగిపోయారు. మంత్రి సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోవడంతో కోపోద్రికులైన టిడిపి శ్రేణులు ఓవైపు శంకర్‌ గ్రూపు, మరోవైపు జయచంద్రారెడ్డి గ్రూపు దాడులకు తెగబడడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హుటాహుటిన పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు గ్రూపులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీఛార్జి చేశారు. త్వరలోనే మండలాల వారీగా ప్రతి కార్యకర్తకు సమాచారం ఇచ్చి సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. మంత్రి ఎదుటే తెలుగు తమ్ముళ్లు తన్నులాడుకోవడం నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట మంట కలిసే పరిస్థితి ఏర్పడిందని సీనియర్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కోవర్ట్‌గా వ్యవహరిస్తున్న టిడిపి ఇన్‌ఛార్జి జయచంద్రారెడ్డి మాకొద్దంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేశారు. ఈ పరిస్థితులు గమనించిన మంత్రి మదనపల్లి పర్యటనను సైతం వాయిదా వేసుకున్నారు. టిడిపి అధిష్టానం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ బాబు తంబళ్లపల్లి నియోజకవర్గంపై దష్టి సారించకపోతే పార్టీ మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీడియాపై దురుసు ప్రవర్తన : జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పర్యటన నిమిత్తం కాలేజీకి వెళ్లిన మీడియా వారిపై జయచంద్రారెడ్డికి వర్గానికి చెందిన ప్రతాప్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. బి.కొత్తకోట పట్టణంలో రెండు గ్రూపులను చిత్రీకరిస్తున్న మీడియా వారిపై దురుసుగా ప్రవర్తించడంపై పలువురు పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వారిపై అసభ్యకరమైన పదజాలంతో దూషించి ప్రతాపరెడ్డి, జయచంద్రారెడ్డి గ్రూపునకు చెందిన వారు దాడికి తెగబడడం ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చ.

➡️