- ఆరేళ్లుగా ఆత్మకూరులోనే తిష్ట
- యథేచ్ఛగా అక్రమ వసూళ్లు
ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు పోలీసు స్టేషన్‌లో ఆయనో ఏఎస్‌ఐ. పేరుకు ఏఎస్‌ఐ అయినా ఆ స్టేషన్ కి ఆయనే సర్వాధికారి. ఆయన రూటే సప’రేటు’గా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్ ముందు నుంచి వెళ్లే ఏ వాహనమైనా ఆయనకు కప్పం కట్టనిదే ముందుకు కదలదని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇసుక ట్రాక్టర్లే ప్రధాన ఆదాయ వనరుగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ట్రాక్టర్ల యజమానులు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆత్మకూరు పోలీసు స్టేషన్ లో ఆయన ఏఎస్‌ఐ గా పని చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం విధుల్లో చేరిన ఆయన నేటికీ అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. బెళుగుప్ప మండలం కాలువపల్లి పెన్నానది నుంచి రోజూ పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు జిల్లా కేంద్రానికి వెళ్తుంటాయి. వీటినే ఆయన ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆత్మకూరులో విధుల్లో చేరిన ఆయన అప్పట్లో అదే స్టేషన్ లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్, ఓ హౌంగార్డు ద్వారా యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ట్రాక్టర్ల యజమానులను బెదిరించి జిల్లా కేంద్రంలో తాను నిర్మిస్తున్న ఇంటికి యథేచ్ఛగా ఇసుకను తరలించారని సమాచారం. ఇక రాత్రి సమయంలో స్టేషన్ ముందు నుంచి వెళ్లే కూరగాయల వాహనాలను సైతం వదలకుండా డబ్బు లేదంటే కూరగాలైనా ఇవ్వాల్సిందేనని పీడించి మరీ వసూలు చేస్తారని వాహన యజమానులు వాపోతున్నారు. ఆరు నెలల క్రితం తపోవనానికి చెందిన ఒక ట్రాక్టర్ ను తలుపూరు క్రాస్ వద్ద పట్టుకున్నారు. అప్పట్లో విధుల్లో ఉన్న ఓ హౌంగార్డు ద్వారా రూ.4 వేలు తీసుకుని వదిలివేసినట్లు తెల్సింది. 4 నెలల క్రితం తిరిగి అదే ట్రాక్టర్ ను ఆత్మకూరులో పట్టుకున్నారు. అయితే దాని యజమానిపై కేసు నమోదు చేయడంతో పాటు కోర్టుకు హాజరు పరచడానికి 15 రోజులు తిప్పుకుని డబ్బులు వసూలు చేసినట్టు ఆ ట్రాక్టర్ యజమానే చెబుతున్నాడు. ఇప్పటికైనా. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఆరేళ్లుగా ఆత్మకూరులోనే తిష్ట వేసిన ఆ ఏఎస్‌ఐ ని బదిలీ చేయాలని ప్రజలు, వాహన యజమానులు కోరుతున్నారు.