మాట్లాడుతున్న ఎన్.వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణకు సంబంధించి 12వ పిఆర్‌సి చైర్మన్‌ను తక్షణమే నియమించాలని, 2023 జులై 1 నుండి అమలు కావాల్సిన పిఆర్‌సికి ఇంత వరకూ చైర్మన్‌ను నియమించకపోవటం సరికాదని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. బ్రాడీపేటలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన యుటిఎఫ్ ఆఫీసు బేరర్స్ సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలలైనా ఎన్నికల హామీలు అమలుకు చర్యలు తీసుకోలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే పిఆర్‌సి కమిషన్‌ను తక్షణమే నియమిస్తామని, సకాలంలో డిఎ విడుదల చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. ఇంత వరకూ చైర్మన్‌ను నియమించ కపోతే నియామకం జరిగి, వారికి విధి విధానాలు అప్పగించి, సంఘాలతో చర్చలు జరిపి, పిఆర్‌సి అమలు చేయటానికి మరింత అలస్యం అయ్యే అవకాశం ఉందని అన్నారు. దీనిపట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన మూడు డిఏలు ఇప్పటికీ చెల్లించలేదని, మరొక డిఏ జూలైకి రాబోతుందని ఇప్పటికైనా డీఎలను తక్షణం చెల్లించాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం 2017లో ఇచ్చిన మెమో 57ని ఇంతవరకు అమలు చేయకపోవడం సరికాదన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై తక్షణమే స్పందించకుంటే ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని స్పష్టం చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర ప్రచురణ విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీకి ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలలను అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని, మిగిలిన ప్రాథమిక పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలని కోరారు. 60 మంది విద్యార్థులు దాటిన ప్రాథమికోన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయాలని, మిగిలిన ప్రాథమికోన్నత పాఠశాల యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియాలను కొనసాగిస్తూ ప్లస్2 పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్, జిల్లా సహాధ్యక్షులు వై.నాగమణి, కోశాధికారి ఎమ్‌డి.దౌల, జిల్లా కార్యదర్శులు ఆదినారాయణ, సాంబశివరావు, గోవిందయ్య, ఆంజనేయులు, షకీలా బేగం, కేథార్‌నాథ్ రంగారావు, ప్రసాద్, ఆడిట్ కమిటీ శ్రీనివాసరావు, కోటిరెడ్డి, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు
