చోరీ కేసులో నిందితులు అరెస్టు

ప్రజాశక్తి-అద్దంకి: మద్యం దుకాణాల్లో చోరీలకు పాల్పడిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అద్దంకి పోలీస్‌ స్టేషన్లో డీఎస్పీ మహమ్మద్‌ మోయిన్‌ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వినుకొండ పట్టణానికి చెందిన మెండురి శ్రీరామ్‌, తోమాటి చరణ్‌, సిద్ధ బత్తుల రామ సాయి, పోల వెంకటరెడ్డి, నక్క లక్ష్మణరావు, షేక్‌ చిన్న ఫరీద్‌ భాష, వేముల నాగరాజులు మద్యానికి, చెడు అలవాట్లకు బానిసై చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో అద్దంకి మండలంలోని గొర్రెపాడు రోడ్డులో ఉన్న అంకమ్మ తల్లి వైన్స్‌, శాంతినగర్‌ వద్ద ఉన్న మారుతి వైన్స్‌లలో దొంగతనాలకు పాల్పడ్డారు. గత నెల 28వ తేదీన కారులో వీరంతా కారులో వచ్చి మద్యం దుకాణాలలో షట్టర్‌ను పగలగొట్టి దాదాపు 685 మద్యం సీసాలను దొంగిలించారు. దొంగతనం జరిగిన రోజు నుంచి అద్దంకి సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించారు. శనివారం నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1,31,370 విలువైన మద్యం సీసాలు, నేరానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచునున్నట్లు తెలిపారు. త్వరగా నిందితులను పట్టుకున్నందుకు డీఎస్పీ చేతుల మీదుగా సీఐ సుబ్బరాజు, ఎస్‌ఐ ఖాదర్‌ భాషా, పోలీస్‌ సిబ్బందికి రివార్డులు అందజేశారు.

➡️