అదనపు భారం అధికం!

Dec 6,2024 01:07

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్‌ ఛార్జీల పెంపుదల కొనసాగుతోంది. విద్యుత్‌ ఛార్జీలపై అదనపు భారం మోపుతూ వివిధ రూపాల్లో పెరిగిన ఛార్జీలతో జారీ చేసిన బిల్లులు గత రెండ్రోజులుగా వినియోగదారులకు అందుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలను పెంచబోమని ప్రజాగళం సభల్లో ఊదరగొట్టిన చంద్రబాబు విద్యుత్‌ రెగ్యులేటరీ అధారిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా సర్దుభాటు పేరుతో ఛార్జీల పెంపునకు పచ్చజెండా ఊపడంతో ప్రజలు దొందూ దొందే అన్న భావనతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి విద్యుత్‌ బిల్లులకు వినియోగదారులకు అందుతున్నాయి. మీటర్‌ రీడింగ్‌ తీసి అపరేటర్లు ఇస్తున్న బిల్లులను చూసి వినియోగదారులు షాక్‌ అవుతున్నారు. ఇప్పటికే రెండు పద్ధతుల్లో అమలులో ఉన్న ట్రూఅప్‌, అదనపు సర్ధుబాటు ఛార్జీలకు అనుగుణంగా ప్రతి బిల్లుకు రూ.90 నుంచి రూ.350 వరకు అదనం భారం పడుతోంది. గుంటూరు ఎటి అగ్రహారం ప్రాంతానికి చెందిన షేక్‌ కరిముల్లా అనే వ్యక్తికి మొత్తం 9 యూనిట్లు మాత్రమే వినియోగించగా బిల్లు మాత్రం అదనపు సర్దుబాటు చార్జీలతో కలిపి రూ.397 వచ్చింది. నరసరావుపేటకు చెందిన మరో వినియోగదారుడికి గత నెలలో 162 యూనిట్ల సగటు వినియోగానికి రూ.1032 బిల్లు రాగా ఈ నెలలో తిరిగి 162 యూనిట్లకు రూ.1270 బిల్లు వచ్చింది. 36 నెలల పాటు వసూలు చేసే ట్రూఅప్‌ 29వ వాయిదా భారం ఈనెలలో కొనసాగింది. ఎఫ్‌.టి.పి.సి.ఏ చార్జీలు 4/22, 10/24 చార్జీలు కూడా అదనంగా జతయ్యాయి. దీంతో ప్రతి బిల్లుకు అదనపు భారం తప్పడం లేదు. మరోసారి అదనపు సర్ధబాటు పేరుతో భారం కొనసాగింపును ప్రజలు తప్పుపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.7912 కోట్లు వినియోగదారులపై భారం పడనుంది. ఇందులో ఉమ్మడి జిల్లాపై రూ.650 కోట్ల వరకు భారం వేయనున్నారు. గతంలో బిల్లులు చెల్లించిన వినియోగానికి మళ్లీ బిల్లులు వసూలు చేయడం గత ఐదేళ్లుగా పరిపాటిగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 18 లక్షల మంది వినియోగదారులపై విద్యుత్‌ ఛార్జీల భారం పడుతోంది. వైసిపి హయాంలో ట్రూ అప్‌ ఛార్జీలతో పాటు అదనపు సర్ధుబాటు ఛార్జీల వసూలును తప్పుపట్టిన నేతలే ఇప్పుడు విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఇచ్చిన నివేదికలను ఆమలుకు పూనుకున్నాయి. విద్యుత్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా ఇప్పటికే వామపక్షాలు ఆందోళనకు పూనుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెలలో వైసిపి కూడా నిరసనలు తెలపాలని నిర్ణయించింది. విద్యుత్‌ పంపిణీ సంస్థలకు నష్టాలు వస్తే ప్రభుత్వం భరించడం 2014 వరకు అమలు జరిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ఇందుకు భిన్నంగా నష్టాలను ప్రజలపై వేర్వేరు రూపాల్లో చెల్లించిన బిల్లులకే మళ్లీ వసూలుకు శ్రీకారం చుట్టింది. ఇదే పద్ధతిని కూటమి ప్రభుత్వం కూడా ప్రజలపై భారం మోపేందుకు మొగ్గుచూపుతూ గత ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తుందని ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. 2014 నుంచి 2019 మధ్య టిడిపి ప్రభుత్వ నిర్వాకం వల్లే తాము అదనపు భారం వేయాల్సి వస్తుందని వైసిపి నేతలు ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు వైసిపి ప్రభుత్వ నిర్వాకం వల్లే ఛార్జీల సర్దుబాటు (పోటు)ను అమలు చేయాల్సి వస్తోందని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

➡️