పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం

ప్రజాశక్తి-దర్శి: దర్శి మండలం పోతవరం గ్రామంలో నిర్వహించిన మన ఇల్లు-మన గౌరవం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, హౌసింగ్‌ డిఇ డి నిరీక్షణరావు, ఎఇ షాకీర్‌బాషా, సచివాలయ సిబ్బంది తదితర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటం తప్ప పేద ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. అందుకే ప్రతి పేదవాని ఇంటి కల నెరవేరాలన్న కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కసరత్తు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2025 గడువులోపు మంజూరైన ఇంటిని పూర్తి చేసి ప్రభుత్వం ఇచ్చే రాయితీ రుణాన్ని అందుకోవాలని డాక్టర్‌ లక్ష్మి కోరారు. ఇళ్ల నిర్మాణానికి ఏవైనా అవరోధాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె అన్నారు. అధికారులు కూడా ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారుల పట్ల కొంత సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోతవరం గ్రామానికి చెందిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️