అంతరాయం లేకుండా సరఫరాకు ప్రత్యేక కార్యాచరణ
ఎపిఇపిడిసిఎల్ సిఎండి పృథ్వీతేజ్
ప్రజాశక్తి- సీతమ్మధార : వినియోగ దారులకు ఎటువంటి అంతరాయాలు లేకుండా, నాణ్యమైన విద్యుత్‌ను అందించేం దుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పథ్వీతేజ్ ఇమ్మడి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలకనుగుణంగా సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు సర్కిళ్ల పర్యవేక్షక ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల వరకు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా అంతరాయాలను నివారించేందుకు పలు సూచనలు చేశారు. జిల్లాలవారీగా తరచూ ఏర్పడుతున్న అంతరాయాలను గుర్తించేందుకు 33 కెవి ఫీడర్స్, 11 కెవి ఫీడర్స్‌ను ఎంపిక చేసుకొని వాటిని సర్వే చేసి లోపాలను పిఎంఐ సర్వే మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారని తెలిపారు. ఇందులో భాగంగా గాలి వేసేటప్పుడు చెట్ల కొమ్మలు తగలడం, ఒరిగిన స్తంభాలు, తుప్పుపట్టిన స్తంభాలు, పొట్టి స్తంభాలు, స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండి వేలాడుతున్న వైర్లు, ఇన్సులేటర్ పగుళ్లు, సపోర్ట్ వైర్లు, సపోర్ట్ స్తంభాలు లేకపోవడం మొదలగు విషయాలను నమోదుచేసి వాటిని త్వరితగతిన సరిచేసి అంతరాయాలను పూర్తిగా తగ్గించి వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు ఆదేశాలిచ్చామన్నారు. దీనికనుగుణంగా గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు సర్కిళ్ల వారీగా సుమారు 500 ఫీడర్లలో సర్వే ప్రారంభించామన్నారు. లోపాలను పిఎంఐ సర్వే యాప్ లో నమోదుచేసి వాటిని సరిచేసి అంతరాయాలను తగ్గిస్తున్నామని తెలిపారు.కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించి వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తామన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలను టోల్ ఫ్రీ నంబర్ 1912 కు తెలియచేస్తే సకాలంలో పరిష్కరిస్తామన్నారు.
ఎపిఇపిడిసిఎల్ సిఎండి పృథ్వీతేజ్