ప్రజాశక్తి – సాలూరు : ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్‌ఎస్) కార్యక్రమంలో మంత్రి పాల్గొని 139 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలకు చెందిన అర్జీదారులు పాల్గొని, తమ సమస్యలను మంత్రికి వివరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉండే సమస్యలను తక్షణ పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సమస్యను జిల్లా అధికారుల సమక్షంలో పరిష్కరిస్తామని, గత ప్రభుత్వంలో భూసమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని మంత్రి తెలిపారు. ప్రజావేదికలో ఎక్కువగా భూసమస్యలు, ఇళ్ల పట్టాలు, పింఛన్లు, టిడ్కో గృహాలు, రహదారులు, తాగునీరు తదితర సమస్యలకు చెందిన అర్జీలు వచ్చాయని ఆమె తెలిపారు. వచ్చిన అర్జీల్లో కొందరి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. స్వీకరించిన వినతుల్లో కొన్ని…. సాలూరు పట్టణంలో గత టిడిపి హయాంలో 365 చదరపు అడుగు టిడ్కో ఇల్లు మంజూరు కాగా, రూ.12,500 చొప్పున మూడు డీడీలు ఇచ్చామని, కానీ నేటికీ ఇల్లు ఇవ్వలేదని, కావున తమకు ఇళ్లు ఇప్పించాలని 13వ వార్డుకు చెందిన పప్పుల లక్ష్మి, ఎం.కనకదుర్గ, ఎం.కష్ణవేణి, ఎల్.కల్పన, పి.పార్వతి,డి. తిరుపతమ్మ, ఆర్.సరస్వతి, పి.గౌరి, జి.రేవతి తదితరులు మంత్రికి దరఖాస్తును అందజేశారు. సాలూరులోని పెదకోమటి పేట 26వ వార్డు నుంచి కటమ పరమేశ్వరరావు తనకు వృద్ధాప్య పింఛను మంజూరుచేయాలని కోరారు. 9వ వార్డు ముత్తారసు వీధికి చెందిన ఎస్.తిరుపతిరావు తనకు 15 నెలల క్రితం పక్షవాతం వచ్చిందని, సదరన్ సర్టిఫికేట్ లేకపోవడంతో పింఛను రావడం లేదని, కావున సదరన్ సర్టిఫికేట్ ఇప్పించి, పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ కె.హేమలత, మున్సిపల్ కమిషనర్ సిహెచ్.సత్యనారాయణ, డిఆర్‌డిఎ పీడీ వై.సత్యం నాయుడు, ఐటిడిఎ ఎపిఒ పి.మురళీధర్, సాలూరు, పాచిపెంట, మక్కువ తహశీల్దార్లు ఎన్‌విరమణ, డి.రవి, షేక్ ఇబ్రహీం, ఎంపిడిఒలు పాత్రో, రమాదేవి, స్వరూపా రాణి, డిఎల్డిఓ రమేష్ రమణ, జిఎస్‌డబ్ల్యూఎస్ వి.చిట్టిబాబు, మెడికల్ ఆఫీసర్ శివకుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.అర్జీలపై తక్షణ చర్యలు తీసుకోండి : కెఆర్‌ఆర్‌సి ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్ది పార్వతీపురం : ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి 68 వినతులు వచ్చాయని, వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కెఆర్‌ఆర్‌సి ప్రత్యేక ఉపకలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్ది జిల్లా అధికారులను కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన పిజిఆర్‌ఎస్ కార్యక్రమంలో ప్రత్యేక ఉపకలెక్టర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖాధికారులు పరిశీలించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు తెలిపారు. పరిష్కారమైన అర్జీలతో అర్జీదారుడు సంతృప్తి చెందాలని, అర్జీలు పునఃప్రారంభం కాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అందిన కొన్ని అర్జీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.గుమ్మలక్ష్మీపురం మండలం చింతలపాడుకు చెందిన ఎన్.సింహాచలం ఎల్విన్‌పేట, గుమ్మలక్ష్మీపురం పంచాయితీల్లోని అక్రమ కట్టడాలను తొలగించాలని వినతి పత్రాన్ని అందజేశారు. తమ ఇంటి పక్కన ఉన్న హెచ్.టి లైన్ కరెంటు స్తంభాలు వాలి ఉండడంతో మేడపైకి వెళ్లలేకపోతున్నామని, ఈ విషయాన్ని విద్యుత్ శాఖ సిబ్బందికి పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని, కావున దీనిపై చర్యలు తీసుకోవాలని గరుగుబిల్లికి చెందిన ఎన్.చంద్రశేఖర రావు అర్జీని అందించారు. తమ గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 127/సిలో గల 0.78 సెంట్లు భూమిని పట్టాదారు పాస్ పుస్తకంలో నమోదు చేయాలని కురుపాంకు చెందిన ఎం.వాసుదేవరావునాయుడు దరఖాస్తు అందజేశారు. పార్వతీపురం మండలం డోకిశీలలో సుమారు 4 ఎకరాల్లో ఉన్న భూమిని ప్రభుత్వం సర్వే చేయించి 1-బి, పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని బి.నారాయణరావు కోరారు. సాలూరు మండలం అన్నంరాజువలస నుంచి ఎం.ఎల్లమ్మ అర్జీని ఇస్తూ తనకు జీవనాధారం నిమిత్తం మేకల పెంపకం కొరకు సబ్సిడీతో కూడిన రుణాన్ని మంజూరు చేయాలని దరఖాస్తు అందించారు. గరుగుబిల్లి మండలం బురదవెంకటాపురానికి చెందిన బి.సత్యంనాయుడు గత రెండు మాసాలుగా తనకు పింఛను అందడంలేదని, కావున దాన్ని మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. పెదగుడబకు చెందిన ఎన్.తేరిజమ్మ తనకు వితంతు పింఛను ఇప్పించాలని, గరుగుబిల్లికి కె.సత్యంనాయుడు తనకు చెవిటి మిషన్ మంజూరుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఐటిఐ స్థలానికి ప్రహరీ నిర్మించాలని మంత్రికి వినతి
సాలూరు : ప్రభుత్వ ఐటిఐ నిర్మాణానికి కేటాయించిన 1.10 ఎకరాల భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని కోరుతూ ప్రిన్సిపల్ రవికుమార్, ప్లేస్ మెంట్ అధికారి కోట్ల శ్రీనివాసరావు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో వారు మంత్రి సంధ్యారాణిని కలిసి సమస్యల్ని వివరించారు. కేటాయించిన భూమి ఆక్రమణకు గురికాకుండా వుండాలంటే దాని చుట్టూ ప్రహరీగోడ నిర్మించాలన్నారు. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో సమస్యకు పరిష్కారం చూపినందుకు వారు మంత్రి సంధ్యారాణికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రహరీ గోడ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.