మహాత్ముల ఆశయాలు శిరోధార్యం

Oct 2,2024 21:47

 గాంధీ, లాల్‌ బహుదూర్‌శాస్త్రి జయంతి కార్యక్రమంలో కలెక్టర్‌ అంబేద్కర్‌

ప్రజాశకి-విజయనగరంకోట :  జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఆశయాలు మనందరికీ శిరోధార్యమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, లాల్‌బహుదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని మహాత్ముని విగ్రహానికి, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు జాతికి చేసిన సేవలను శ్లాఘించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతు మాధవన్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొని పూలమాలలతో నివాళులర్పించారు.

జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో..

జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతిని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో శాంతియుత స్ధాపనకు మహాత్ముడు చూపిన అహింసా మార్గం, సెక్యులరిజం అన్నవి ప్రతీ ఒక్కరూ ఆచరించాల్సిన మార్గాలన్నారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ ఒక్కరూ ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎఎస్‌పి సౌమ్యలత, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

జిల్లా కోర్టులో..

విజయనగరం లీగల్‌ : గాంధీ జయంతి సందర్భంగా స్థానిక విటి అగ్రహారం పాత జిల్లా కోర్టు భవనంలో ఉన్న జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయం ఆవరణలో మహాత్మ గాంధీ విగ్రహానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్‌ చక్రవర్తి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పాత జిల్లా కోర్టు భవనంలో మున్సిపల్‌ ఆఫీసు సిబ్బంది మరియు జిల్లా కోర్టు సిబ్బందితో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ జి.దుర్గయ్య, సివిల్‌ జడ్జి తర్లాడ రాజేష్‌ కుమార్‌, జిల్లా కోర్టు సిబ్బంది పాల్గొన్నారు

డల్లాస్‌లో మంత్రి కొండపల్లి నివాళి

గత వారం రోజులుగా అమెరికాలో పర్యటనలో ఉన్న రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ గాంధీ జయంతి సందర్భంగా డల్లాస్‌ లోనే గాంధీ విగ్రహాన్ని సందర్శించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడుతో కలిసి స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానేత జాతిపిత మహాత్మా గాంధీ అని మంత్రి కొండపల్లి కొనియాడారు.

స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి : ఎమ్మెల్యే

స్వాతంత్య్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని టిడిపి పాలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. బుధవారం స్థానిక టిడిపి పార్టీ కార్యాలయం అశోక్‌ బంగ్లాలో గాంధీజి, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహనీయులు ప్రాణాలు త్యాగం చేసి దేశానికి స్వాతంత్య్రం సాధించారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరానిదని అన్నారు కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. విజయనగరం టౌన్‌ : గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు మేయర్‌ వి.విజయలక్ష్మి, కమిషనర్‌ పి.నల్లనయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి కార్యాలయ సిబ్బంది పాలొన్నారు.

➡️