రాచగావుతో ప్రారంభమైన పల్నాటి వీరారాధన ఉత్సవాలు

Dec 1,2024 01:42

ప్రజాశక్తి – కారంపూడి : 900 ఏళ్లకు పైగా ప్రతిఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు రాచగావుతో శనివారంప్రారంభమయ్యాయి. ఐదురోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో చరిత్రను పరిశీలిస్తే…మినీ మహాభారతంగా పిలవబడే అలనాటి పలనాటి యుద్ధం సుమారు 1178 నుండి 1182 వరకు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. 11వ శతాబ్ధంలో చోళులు మధ్యప్రదేశ్‌ నుండి వచ్చి ఇక్కడ వేలనాడు అనే సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ వేళనాడును అనుగురాజు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. నేటి పలనాడు కూడా ఆనాటి వేళనాడులోనే ఉంది. అనుగురాజుకు తెలుగు రానందున దొడ్డ నాయుడును మంత్రిగా నియమించుకొని రాజ్యాన్ని పరిపాలిస్తుండేవారు. దొడ్డ నాయుడు కుమారుడే బ్రహ్మనాయుడు. అణుగురాజుకు ముగ్గురు భార్యలని ఈయనకు సంతానం లేనందున దొడ్డ నాయుడు కుమారుడైన బ్రహ్మనాయుడుని దత్తత తీసుకున్నాడని, కొన్నేళ్లకు అనుగురాజు కూడా సంతానం కలిగినట్లు చరిత్ర. నాటి పల్నాటి రాజ్యంలో మాచర్ల,గురజాల, కారంపూడి ప్రాంతాలుండేవి. అనుగురాజు కుమారులైన నలగామరాజు, మలిదేవరాజు రాజ్యపాలనలో బ్రహ్మనాయుడు మంత్రిగా ఉండేవాడు. అదే సమయంలో మరో మంత్రిగా నాగమ్మను కూడా నియమించారు. నాగమ్మ మంత్రి అయిన నాటి నుండి రాజ కుటుంబంలో మనస్పర్ధలు ఏర్పడి రెండు రాజ్యాలుగా విడిపోయినట్టు చరిత్ర చెబుతోంది. గురజాల రాజ్యాన్ని నల్లగామరాజు పరిపాలిస్తుండగా ఈ రాజ్యానికి మంత్రిగా నాయకురాలు నాగమ్మ, మాచర్ల రాజ్యాన్ని మలిదేవరాజు పరిపాలిస్తుండగా ఈ రాజ్యానికి బ్రహ్మనాయుడు మంత్రిగా ఉండేవారు. నిత్యం ద్వేషాలతో రగిలిపోయే దాయాదులు కయ్యానికి కాలుదువ్వుకునేవారు. బ్రహ్మనాయుడు ఆనాడే కుల వివక్షతను వ్యతిరేకించాడు. నేటికీ చాపకుడుగా పిలవబడే సహపంక్తి భోజనాన్ని మనుషులందరు సమానమని బ్రహ్మనాయుడు ఆనాడే ఏర్పాటు చేశాడు. దళితుడైన కన్నమదాసును సైన్యాధ్యక్షుడుగా నియమించాడు. మని దేవరాజు రాజ్యాన్ని కూడా ఎలాగైనా సేజిక్కించుకోవాలని నాయకురాలు నాగమ్మ కోడిపందాల పెట్టాలని పురికొల్పింది. కోడిపందాలలో ఓడిపోయిన వారు ఏడేళ్లు రాజ్యాన్ని వదిలి వెళ్లాలని షరతుతో దయాదులు కోడిపందాలకు దిగారు. కోడిపందాలకు నాడు నాయకురాలు నాగమ్మ పన్నిన పన్నాగం వలన బ్రహ్మనాయుడు కోడి ఓడిపోవడంతో మలిదేవరాజు, బ్రహ్మనాయుడు రాజ్యాన్ని వదిలేసి అడవి బాట పట్టారు. ఏడేళ్ల అరణ్యవాసం పూర్తి చేసుకున్న తరువాత రాజ్యాన్ని మాకు అప్పగించాలని మలిదేవరాజు దగ్గర బంధువైన అలరాజును రాయబారానికి పంపడంతో అలరాజును నాయకురాలు నాగమ్మ చంపిస్తుంది. దీంతో యుద్ధం తలెత్తినట్లు చరిత్ర చెబుతుంది. జీవనదిగా పిలవబడే నాగులేరు పక్కనగల నేడు వీర్ల దేవాలయంగా పిలవబడే వీర్ల గుడి ఆవరణలో నాలుగేళ్లపాటు సాగిన పలనాటి యుద్ధంలో అనేకమంది మరణించారు. బ్రహ్మనాయుడు బంధువులు 66 మంది కూడా యుద్ధంలో మరణించడంతో బ్రహ్మనాయుడు వైరాగ్యం చెంది గుత్తికొండ బిలానికి వెళ్లినట్లు చరిత్ర చెబుతుంది. ఈ 66 మందికి గుర్తుగా 66 శివ లింగాలను వీర్ల దేవాలయంలో ప్రతిష్టించారని చెబుతుంటారు. నాయకురాలు నాగమ్మ కూడా యుద్ధం అనంతరం వైరాగ్యంతో తపోవనంకు వెళ్ళినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. నాడు జరిగిన పరిణామామంతటిని ప్రపంచానికి తెలియజేయాలని యుద్ధం జరిగిన ప్రదేశంలోనే బ్రహ్మనాయుడు వీరాచరపీఠం ఏర్పాటు చేసి ఆ పీఠానికి పిడుగు వంశస్తులను అధ్యక్షులుగా నియమించాడు. నాడు యుద్ధంలో జరిగిన ప్రతి ఘట్టాన్ని మహోత్సవాల రూపంలో నేటికీ ఆచరిస్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యుద్ధం చేసిన యుద్ధ వీరులను స్మరించుకుంటూ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలను పూజిస్తూ ప్రతిష్టాత్మకంగా పల్నాటి వీరుల ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రపంచంలో యుద్ధ వీరులను స్మరించుకుంటూ రోమ్‌ నగరం, కారంపూడిలో మాత్రమే పలనాటి ప్రాంతంలో కార్తీక మాసం చివరలో అమావాస్య రోజున ప్రారంభమయ్యే ఉత్సవాలు ఐదు రోజులపాటు నిర్వహిస్తుంటారు. రాచగావు, రాయబారం, మందపోరు,క ోడిపోరు, కల్లిపాడు ఇలా ఐదు రోజులు పాటు ఐదు రోజుల విశిష్టతను తెలియజేస్తూ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో 14 రాష్ట్రాల్లో ఉన్న వీరాచారవంతులకు ఆహ్వానం పంపారు. ఇప్పటికే పోతురాజుకు నూట ఒక్క పోగులతో ఆనకట్ట కట్టి ఉత్సవ ప్రక్రియను శనివారం మొదలుపెట్టారు. కారంపూడిలో నాడు రాజులు నిర్మించిన కోట బురుజు, శంకుతీర్థ మండపం, కన్నమనీయుడు మేడ, నామ తీర్థ మండపం, వీర్ల అంకాలమ్మ దేవాలయం, వీర్ల గుడి ఆవరణలో కాలభైరవ దేవాలయం, కళ్లిపోతురాజు మండపం, అంకాలమ్మ ముగ్గు, బ్రహ్మనాయుడు పులి జూదం నేటికీ చెరిగిపోని వారి ఆనివాళ్లుగా ఉండటం విశేషం.
ఎండ్ల పందేలు, క్రికెట్‌ పోటీలు ప్రారంభం
పల్నాటి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఎడ్ల పందెలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ శనివారం ప్రారంభించారు. వీరు తొలుత అంకళమ్మ, చెన్నకేశవ దేవాలయంలో ప్రత్యేక పూజలు, అనంతరం వీర్ల దేవాలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. అనంతరం గురుకుల పాఠశాల ఆవరణలో క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు. కారంపూడి సర్పంచ్‌ సరస్వతిభాయి బాలునాయక్‌, టిడిపి మండల అధ్యక్షులు యు.లకీëనారాయణ, నాయకులు పి.పుల్లయ్య, పి.అంజయ్య, పి.రాఘవ, కె.బాలకృష్ణ, రాము, సురేష్‌ యాదవ్‌, నాగేశ్వరరావు, శ్రీను, మాజీ ఎంపిపి నాగుల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️