ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజలకు నష్టం కలిగించే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ధర్నానుద్దేశించి ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.రవీంద్రనాథ్, రైతు కూలీ సంఘం (ఎపి) రాష్ట్ర కార్యదర్శి డి.వర్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేష్ మాట్లాడారు. కేంద్రంలో బిజెపి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా తమ విధానాల్లో మార్పు లేదన్నారు. ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, జనసేన ప్రభుత్వాలు రాష్ట్రంలో అవే విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. సర్వ సంపదలు సృష్టించేది కార్మికవర్గం, ప్రజలకు తిండిపెట్టేది రైతాంగమని, కాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. గత పదేళ్లలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.19.28లక్షల కోట్లు రుణమాఫీ, పన్నురాయితీ, ప్రోత్సాహాల పేరుతో ప్రజా ధనాన్ని దోచిపెట్టిందన్నారు.విశాఖస్టీల్ ప్లాంట్ సహా ఇతర భారీ పరిశ్రమలు, సముద్రతీరాన్ని కారుచౌకగా కార్పొరేట్లకు కట్ట బెడుతున్నదని అన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వడం లేదని, సుప్రీంకోర్టు చెప్పినా అంగన్వాడీ,ఆశా, మధ్యాహ్నభోజన, స్కూల్ ఆయాలు, కార్మికులను ‘కార్మికులుగా’ గుర్తించడం లేదని అన్నారు. ఎంత కాలం పనిచేసినా పర్మినెంట్ చేయకూడదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్, ఔట్సోర్స్, ట్రైనీ, గౌరవవేతనం లాంటి పేర్లతో కార్మికులను అత్యంత దోపిడీ చేస్తున్నాయని అన్నారు. కార్మికులు తిరగబడతారని తెలిసే 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా కేంద్రం మార్చిందన్నారు.వ్యవసాయ దేశమైన మన దేశంలో కార్మిక వర్గం, రైతాంగం కలిసి ఐక్యంగా పోరాడితేనే మన లక్ష్యం సాధించగలమన్నారు.లేబరు కోడ్‌లను వెంటనే రద్దుచేయాలని, కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను ఆపాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, స్కీమ్ వర్కర్లు, ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, పెన్షన్, గ్రాట్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపుకార్డులు, రుణ సౌకర్యం అమలు చేయాలని, భవననిర్మాణం, హామాలీ, ఆటో, రవాణా రంగం తదితర అసంఘటిత కార్మికులకు సమగ్ర సామాజిక సంక్షేమం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ పథకాన్ని విస్తతం చేసి ఆహార భద్రత కల్పించాలనీ, రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పనులను రోజుకు రూ.600 వేతనంతో 200 రోజులకు పెంచాలని, పట్టణాలకు విస్తరించాలని డిమాండ్ చేశారు.ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పైడిపునాయుడు, రాకోటి రాములు, ఎఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెహరా శంకర్రావు, నాయకులు రెడ్డి నారాయణ రావు, ఎం. అప్పలరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టివి రమణ, అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్, మధ్యాహ్నం భోజనం పధకం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎ.గౌరి నాయుడు, బి. సూర్యనారాయణ, మద్దిల రమణ, వ్యవసాయ కార్మిక జిల్లా అధ్యక్షులు జి.శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు ఆదినారాయణ, రామకష్ణ, రవి, మెడికల్ రిప్స్ నాయకులు శ్రీను,మూర్తి, శశిధర్, సుధీర్, ముత్యాలు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్.రంగరాజు ఇఫ్టూ నాయకులు మల్లేష్ , పిఒడబ్ల్యుయు నాయకులు పార్వతి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి. అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అలమండ ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.
రైతు, కార్మిక సంఘాలు ర్యాలీ, రాస్తారోకో
బొబ్బిలి : కేంద్రంలో మోడీ విధానాలను నిరసిస్తూ రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి చర్చి సెంటర్ వరకు ర్యాలీ, అనంతరం రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, ఎఐటియుసి జిల్లా నాయకులు ఎం.శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.గోపాలం, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మునాయుడు, పిసిసి సభ్యులు మువ్వల శ్రీనివాసరావు, ఇఫ్టూ నాయకులు ఎం.గోపాలం మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మార్చివేసి దాడి చేస్తుందని అన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని చట్టం ఉన్న అమలు చేయడం లేదన్నారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, రైతులు, కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.శ్రీనివాసరావు, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వి.శేషగిరిరావు, కార్మికులు, రైతులు, స్కీమ్ వర్కర్లు పాల్గొన్నారు.