ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: మీ కోసం కార్యక్రమంలో వచ్చే ఆర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘మీ కోసం’ కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నందున ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ద పెట్టి, వాటికి ఆర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేసారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్‌లైన్‌లో వచ్చిన వినతులను చూడాలని ఆమె చెప్పారు. సాంకేతిక సమస్యల వలన క్షేత్రస్థాయిలో పరిష్కరించలేని అర్జీలు వస్తే ఆ విషయాన్ని ప్రజలకు అప్పుడే స్పష్టం చేయాలన్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.చినఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, వరకుమార్, డిప్యూటీ కలెక్టరు పార్థసారధి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
