కళ్యాణం ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : టిటిడి ఇఒ

Mar 13,2025 00:22

ప్రజాశక్తి – తుళ్లూరు: శ్రీనివాస కళ్యాణం వేడుకల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని, టిటిడి, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని టిటిడి ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు.ఈ నెల 15 వ తేదీన రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీనివాస కళ్యాణం జరగనుంది. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ నేపధ్యంలో శ్రీనివాస కళ్యాణం వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై ఈవో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి, ఎస్పి సతీష్‌ కుమార్‌, టిటిడి,జిల్లా అధికారులతో బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇఒ మాట్లాడుతూ శ్రీనివాస కళ్యాణంపై వెంకటపాలెం సమీపంలోని గ్రామాల్లో టిటిడి ప్రచారం రథం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా వేదిక పరిసరాలలో అవసరమైన గ్యాలరీలు,క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ అంతరాయం తలెత్తకుండా పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. కళ్యాణానికి భజన బందాలు, శ్రీవారి సేవకులను పెద్ద ఎత్తున ఆహ్వానించాలని చెప్పారు. జిల్లా,టిటిడి అధికారుల కోసం ప్రత్యేకంగా జాయింట్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షించేలా తగు చర్యలు తీసుకోవాలని ఎస్పి సతీష్‌ కుమార్‌ను కోరారు. తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. వేదిక పరిసరాలలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో తక్షణం స్పందించేలా విపత్తు నిర్వహణ బందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు,మజ్జిగ పంపిణీకి శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సాయంత్రం 4 గంటలనుండి సాంస్కృతిక కార్యక్రమాలుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా హెచ్‌ డీపీపీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఆయన అధికారులతో కలసి కళ్యాణ వేదిక, తదితర పరిసరాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. జెసి భార్గవ్‌ తేజ,తెనాలి సబ్‌ కలెక్టర్‌ సంజనా సింహా, డిఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ విజయలక్ష్మి, ఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️