ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : మిర్చి ధర పతనంతో అల్లాడుతున్న రైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరుకు బుధవారం రానున్నారు. మిర్చియార్డులో రైతులను జగన్ పరామర్శిస్తారని వైసిపి జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు. మంగళవారం సాయంత్రం బృందావన్ గార్డెన్స్ వైసిపి జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మిర్చి యార్డుకు ఉదయం 9 గంటలకు జగన్ వస్తారని రైతుల కష్ట, నష్టాలను తెలుసుకుంటారని, వారి ఆవేదనను వింటారని చెప్పారు. రైతులు తమ సమస్యలను జగన్‌కు వివరిస్తే తద్వారా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి న్యాయం చేసేందుకు కృషి చేస్తారన్నారు. టిడిపి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మిర్చితో పాటు అన్ని పంటల ధరలు తగ్గిపోతాయన్నారు. 2019 నుంచి 2024 వరకు మిర్చి ధర రూ.20 వేల నుంచి రూ.27 వేల వరకు పలికిందని, రైతులకు కనీస ధర రూ.20 వేలకు తగ్గకుండా వస్తే ఇప్పుడు మేలు రకాలకు కూడా రూ.12 వేలు కూడా దక్కడం లేదని విమర్శించారు. ఈ ఏడాది ధాన్యం ధర బస్తా రూ.1300, పత్తి రూ.4 వేలకు మించి కొనకపోవడతో రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారని తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు బోనస్ ఇచ్చి ఆదుకోవాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, వైసిపి గుంటూరు నగర అధ్యక్షులు నూరిఫాతిమా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పాల్గొన్నారు.
జగన్ పర్యటనకు ఈసి అనుమతి నిరాకరణ
మిర్చి రైతులను పరామర్శించేందుకు బుధవారం గుంటూరు రానున్న జగన్‌కు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున రాజకీయ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వబోమని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. అయితే జగన్ పర్యటన షెడ్యూలును వైసిపి విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి 11 గంటలకు మిర్చి యార్డుకు వస్తారని 12 గంటల వరకు యార్డులో రైతులతో చర్చించి తరువాత తాడేపల్లికి వెళతారని షెడ్యూలు విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించడంతో ఆయన పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించేటట్లటయితే వచ్చేనెల మొదటి వారంలో ఆయన గుంటూరు వస్తారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.
