రుగ్మతలపై రచయితలు కలం ఎక్కుపెట్టాలి

ప్రజాశక్తి- కడప అర్బన్‌ సమాజంలోని రుగ్మతలను ప్రశ్నిస్తూ అభివద్ధి దిశగా ప్రజలను సమాయత్తం చేయాల్సిన బాధ్యత రచయితలపై ఉందని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విసి ఆచార్య వెలుదండ నిత్యానందరావు అన్నారు. కడప నగరంలోని ఐఎంఎ హాల్లో వైఎస్సార్‌ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘ వెయ్యేళ్లతెలుగు సాహిత్యం – రాయలసీమ భాగస్వామ్యం’ అనే శీర్షికతో 2వ సాహిత్య సాంస్కతిక మహసభలను ఆదివారం సభను కేతు విశ్వనాథరెడ్డి సాహిత్యవేదికపై నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విసి ఆచార్య వెలుదండ నిత్యానందరావు ప్రసంగిస్తూ సాహిత్య సంఘాలు ప్రజల్లో సాహితీ పిపాసను పెంచాలని, ప్రాంతీయ అభివద్ధి నిమిత్తం చైతన్య స్పహ రేకెత్తించాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులకు సరైన మార్గనిర్దేశం చేయడానికి మరింత ఉత్సాహంతో సానుకూల దక్పథంతో సాహిత్య సంఘాలు కషి చేయాలని పేర్కొన్నారు. సభాధ్యక్షులు, వైఎస్‌ఆర్‌ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ అస్తిత్వాన్ని చాటిచెప్పేలా ఈ రెండు రోజుల మహా సభలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. రాయలసీమకు చెందిన భాష, చరిత్ర, సాహిత్యం, సంస్కతి అంశాలపై అనేక పరిశోధన పత్రాలు, సదస్సుల ద్వారా వెలుగు చూశాయన్నారు. విశిష్ట అతిథి, సంఘం గౌరవ సలహాదారులు అలపర్తి పిచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పేరుకు రాయలసీమ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా కవులు, కళా కారులు పాల్గొనడం, రాయలసీమ ఘనతను చాటడం హర్షణీయమన్నారు. సంఘం కోశాధికారి డాక్టర్‌ కొప్పోలు రెడ్డి శేఖర్రెడ్డి స్వాగతం పలుకగా సంఘం ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం వందన సమర్పణ చేశారు. శతాధిక కవి సమ్మేళనంలో కవులు కవితాగానం చేశారు. సంఘం కార్యదర్శి డాక్టర్‌ భూతపురి గోపాలకష్ణ శాస్త్రి సభా సమన్వయం చేశారు. రాయలసీమ పత్రికా రంగంపై డాక్టర్‌ తుమ్మలూరు సురేష్‌ బాబు, రాయలసీమ సినిమాపై భూమిరెడ్డి స్వరూపరాణి, రాయలసీమ సంస్కతి, సంప్రదాయాలు అనే అంశంపై పుట్టా ఓబులేసు పత్రాలను సమర్పించారు. వేమన, సుమతి, భాస్కర శతకాలలో పద్యపఠన పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

➡️