ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను అనుసరించి ఉత్తమ సేవలను అందించాలని నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల అధికారులకు కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో పలు విభాగాల అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన వార్షిక కార్యచరణ ప్రణాళిక వివరాలను తెలిపారు. ప్రధానంగా వేసవికాలంలో ఎక్కడా నీటి కోసం ఖాళీ బిందెల ప్రదర్శనలు జరగకుండా చూడాలన్నారు. ప్రజారోగ్యాన్ని దష్టిలో ఉంచుకొని శతశాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాలన్నారు. వాణిజ్య ప్రాంతాలలో ప్రతి 50 మీటర్ల నిడివిలో ఒక చెత్తబుట్ట ఉండేవిధంగా ఏర్పాట్లు చేయాల న్నారు. అన్నా క్యాంటీన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. పన్నుల వసూళ్ళను ముమ్మరం చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి చేపట్టిన భవన నిర్మాణాలు, అనధికార భవనాలను ఉపేక్షించవద్దని ఆదేశించారు. సమావేశంలో ఎంహెచ్‌ఒ డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు హరిబాబు, రమణమూర్తి, టిపిఆర్‌ఒ సింహాచలం, టౌన్ సర్వేయర్ సింహాచలం, సిటీ మిషన్ మేనేజర్ సన్యాసిరావు, డిఇలు మణికుమార్, శ్రీనివాసరావు, టిపిఎస్ అనిత పాల్గొన్నారు.
తాగునీటి సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్
నగరంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. నగరంలో సక్రమ నీటి పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయినప్పటికీ ఎక్కడైనా తాగునీటి పంపిణీలో సమస్యలు ఎదురైతే ప్రజలు తమకు నేరుగా గాని, నగరపాలక సంస్థ కాల్ సెంటర్ నెంబర్ 98499 06486కు గాని సమాచారం ఇవ్వాలని తెలిపారు. అక్కడక్కడ ఏర్పడిన పైపులైను లీకేజీలను గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజాసమస్యలను, నీటి పంపిణీలో తలెత్తే ఇబ్బందులను కూడా సత్వర పరిష్కారానికి చొరవ చూపుతామని తెలిపారు.
నగరంలోకమిషనర్ పర్యటన
నగరంలోని పలుప్రాంతాల్లో కమిషనర్ నల్లనయ్య పర్యటించారు. ట్యాంక్ బండ్ రోడ్డు ప్రాంతంలో ఆచంట గార్డెన్ వద్ద చెత్తాచెదారాలు నిండి ఉండడాన్ని చూసి సిబ్బందిని మందలించారు. తక్షణమే పరిశుభ్రపరచారని సూచించారు.