ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : తిరుపతి-కరకంబాడి రోడ్డులో తెల్లవారుజామున అత్తూరు డాబా సమీపంలో ఉన్న శ్రీ శ్రీనివాస రెసిడెన్సి అపార్ట్మెంట్ ముందు విద్యుత్ పోల్ ను ఓ కారు అతివేగంగా ఢీకొని ప్రమాదం జరిగింది. స్థానిక సమాచారం మేరకు పంజాబ్లో డెలివరీ చేసిన వాహనంతో బంగారుపాలెంకు చెందిన ఆర్మీ ఉద్యోగులు రోహిత్, ప్రశాంత్ తిరుపతిలో ఉన్న తన బంధువు కానిస్టేబుల్ ఇంట్లో ఓ కార్యక్రమానికి వచ్చారు. తిరుగు ప్రయాణమై తిరుచానూరుకు వెళ్లే క్రమంలో దారితప్పి మంగళం రోడ్డుకు రావడం జరిగింది. అత్తూరు డాబాకు సమీపించడంతో కుక్కలు రోడ్డుపై ఉండడాన్ని గమనించి కారు వేగాన్ని అదుపు చేయలేక రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్తు పోల్ ను ఢకొీని కారు ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో కారులోని బెలూన్లు తెరుచుకొని వాహనంలోని ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాద దాటికి కరెంటు పోలు విరిగిపోవడంతో విద్యుత్ తీగలు తెగి అపార్ట్మెంట్ వాచ్మెన్ కాలికి గాయమైంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.