ప్రజాశక్తి-బొబ్బిలి : బాడంగి మండలం పాల్తేరు, బొబ్బిలి మండలం అలజంగి గ్రామాల మధ్య చెక్‌డ్యామ్ కమ్ కాజ్‌వే నిర్మించి, సాగు, తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే బేబినాయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పాల్తేరు, అలజంగి గ్రామాలు వేగావతి నది పరివాహక ప్రాంతాలని చెప్పారు. సుమారు వెయ్యి నుంచి 1500 వరకు సాగునీటి బోర్లు ఉన్నాయని తెలిపారు. వ్యవసాయానికి ఆదర్శవంతమైన గ్రామంగా పేరుగాంచిన పాల్తేరు ఉన్న బాడంగి మండలానికి చెందిన సూమారు 18 గ్రామాలు, దత్తిరాజేరు మండలంలోని సుమారు 55 గ్రామాలకు సంబంధించి ఇక్కడ తాగునీటి పథకం ఉందని చెప్పారు. పాల్తేరు, అలజంగి గ్రామాల నడుమ చెక్‌డ్యామ్ కమ్ కాజ్‌వే నిర్మిస్తే, ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 70 గ్రామాలకు వ్యవసాయ బోర్లు, మంచినీటి ఆధారిత బోరు బావులకు కావాల్సిన భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.గొల్లాది వంతెనపై పవన్‌కు వినతిబాడంగి మండలం గొల్లాది గ్రామంలో వేగావతి నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే బేబినాయన.. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు వినతి అందించారు. గతంలో సిఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ వంతెన నిర్మాణం వల్ల బొబ్బిలి, బాడంగి ప్రాంతమే కాకుండా దత్తిరాజేరు, గజపతినగరం, మెరకముడిదాం మండలాలకు ఉపయోగపడుతుందని చెప్పారు.
