పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి – నేడు ఓటు వేయనున్న జగన్‌ దంపతులు

ప్రజాశక్తి పులివెందుల టౌన్‌ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌.భారతి ఆదివారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో సిఎం జగన్‌ దంపతులు పులివెందులకు చేరుకున్నారు. రెండు నెలలుగా ప్రజల మధ్య ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం సాయంత్రం పిఠాపురం నియోజకవర్గంలోని ప్రచారంతో ముగింపు పలికారు. ఆదివారం తాడేపల్లి నుంచి తన సొంత నియోజకవర్గం పులివెందులకు వచ్చారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పోలింగ్‌ జరిగేందుకు ముందు సొంత నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కాకుండా వేరే ప్రాంతాలకు చెందిన వారు ఉండేందుకు అవకాశం ఉండదు. ఆయన ఆది, సోమవారం రెండ్రోజులపాటు పులివెం దులలోనే ఉంటారు. ఆయనతోపాటు ఆయన భార్య వైఎస్‌ భారతి కూడా పులివెందులలోనే ఉంటారు.. రాత్రి పులివెందులలోనే ముఖ్యమంత్రి బస చేశారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ నాయకులు, పోలీసులు ఏర్పాటు చేశారు. ఓవైపు పోలింగ్‌.. మరోవైపు సిఎం వస్తుండటంతో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భాకరాపురంలోని జయమ్మ కాలనీలో అంగన్వాడీ కేంద్రం రెండో సెంటర్లో 138 బూత్‌ నెంబర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జగన్మోహన్‌రెడ్డి, భారతి, కడప ఎంపీ వైఎస్‌.అవినాష్‌రెడ్డి అదే పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

➡️