రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం మండలం రాయంపల్లి గ్రామంలో సోమవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ కాలనీ నామఫలకం బోర్డు ఏర్పాటు సందర్భముగా కాలనీవాసులకు, అగ్రవర్ణాల వారికి మధ్య ఘర్షణ తలెత్తింది. గంధం చంద్రుడు అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు దళిత కాలనీలకు మహనీయుల పేర్లు పెట్టాలని యోచనతో మండలంలో పలు దళిత కాలనీలకు బి ఆర్ అంబేద్కర్ కాలనీ పేరు పెట్టారు. ఆ మేరకు నామఫలకం బోర్డు రాయపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు బోర్డు పడిపోవడంతో అంబేద్కర్ జయంతి సందర్భంగా కాలనీవాసులు బోర్డును తిరిగి ఏర్పాటు చేయగా, గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో దళితులు డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు ఈ ఘటనపై ఇరువర్గాల వారు పోలీస్ స్టేషనుకు చేరుకుని జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ జయంతి రోజునే రాయంపల్లి గ్రామంలో అంబేద్కర్ కాలనీ పేరిట ఉన్న బోర్డు ఏర్పాటు సందర్భంగా అగ్రవర్ణాల వారు దీనిని అడ్డుకోవడం విచారకరం.
