హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం : వైసిపి

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూపర్‌ సిక్స్‌ హామీలను గాలికి వదిలేసి వీరబాదుడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్‌ అహమ్మద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిస్సార్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ ధరలు పెరిగి పేదలు గగ్గోలు పెడుతుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు సంపద సష్టిస్తాం, పేదవారిని లక్షాధికారులు చేస్తామంటూ తండ్రి, కొడుకులు ఊరురూ తిరిగి గద్దెనుక్కిన వెంటనే ఖజానా ఖాళీ అంటూ చెప్పడం, 40 ఏళ్ల ఇండిస్టీ చంద్రబాబునాయుడుకు తెలియదా అని ప్రశ్నించారు. ఆనాడు బాదుడే బాదుడు అని తిరిగిన చంద్రబాబునాయుడు ఇప్పుడు చేస్తున్నదేమిటి, వీర బాదుడు కాదా అని పేర్కొన్నారు. నాణ్యమైన కరెంట్‌ ఇస్తామని విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు కరెంటు బాదుడు బాదుతున్నారని తెలిపారు. నాడు లోకేష్‌ రైతులను ఉద్దేశించి స్మార్ట్‌ మీటర్లు ఎవరూ పెట్టుకోవద్దని, అవి బిగిస్తే బద్దలు కొట్టాలని చెప్పి, ఇప్పుడు కేంద్రంతో కుమ్మక్కై స్మార్టుగా స్మార్టు మీటర్లు బిగించేస్తున్నారని పేర్కొన్నారు. ఇది రైతులను మోసం చేసినట్లు కాదా అని సూటిగా ప్రశ్నించారు. అన్ని నిత్యావసర ధరలను ఇష్టానుసారం పెంచేశారని, నూనె దగ్గర నుండి పప్పులు, ఉప్పులు, కూరగాయల రేట్లు అమాంతం పెరిగాయని, వైసిపి ప్రభుత్వంలో ఉన్న ధరలను ప్రజలకు ఒక్కసారి గమనించాలన్నారు. పేరుకే ఉచిత ఇసుక అని, భవన నిర్మాణానికి ఇసుక దొరకడం లేదని, వైసిపి హయాంలోనే ఇసుక సక్రమంగా అందేదని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడని విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సర్పంచ్‌ ఈశ్వరయ్య, కౌన్సిలర్‌ ఈశ్వర్‌ నాయక్‌, అనంత మునిశేఖర్‌, నూరుల్లా, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, కొత్తపల్లి మహేష్‌, చరణ్‌, యూనిస్‌, సాధిక్‌, యాసిన్‌ పాల్గొన్నారు.

➡️