సిమెంటు రోడ్డు నిర్మించాలని కలెక్టర్‌కు వినతి

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: అరుణోదయ కాలనీ చివరిలైన్‌లో సిమెంట్‌ రోడ్డు నిర్మించాలని కాలనీవాసులు సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావిజ్ఞప్తుల కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తాము 1994 నుంచి కాలనీలో నివాసం ఉంటున్నామన్నారు. అప్పటి ప్రభుత్వం ఇళ్లపట్టాలు మంజూరు చేశాక కరెంటు సౌకర్యం, మట్టి రోడ్డు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా తదితర కార్యక్రమాలతో క్రమక్రమంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ నేపథ్యంలో కొందరు అక్రమార్కులు ఈ కాలనీ రోడ్డు తమదని గ్రూపులు గ్రూపులుగా వచ్చి తమను నిత్యం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు రోడ్డు లేదని, మీ ఇళ్లు కూడా తీసివేయాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. తమను బెదిరింపులకు గురిచేస్తున్న వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. కాలనీకి సిమెంటు రోడ్డు, డ్రైనేజి కాలువలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

➡️