సమస్యలపై జాప్యం వహిస్తే సహించబోం : కలెక్టర్‌

Mar 10,2025 21:34

ప్రజాశక్తి – పార్వతీపురం  : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తులపై అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పిజిఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్‌ఎస్‌) కార్యక్రమం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో 136 మంది అర్జీదారుల నుంచి వినతులను కలెక్టర్‌ స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో ఆయన మాట్లాడుతూ పిజిఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కారం కావాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని పేర్కొన్నారు. అర్జీదారుల విజ్ఞప్తులను అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్లి పరిశీలించాలని సూచించారు. పారదర్శకంగా విచారణ చేసి, ఆపై అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోగా సమస్య పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. పిజిఆర్‌ఎస్‌ విజ్ఞప్తులపై నిర్లక్ష్యం పనికిరాదని, జాప్యం జరిగితే సహించబోమని తెలిపారు. అలాగే దిగువ స్థాయి అధికారులను పంపి మొక్కుబడిగా పరిష్కారం చేస్తే ఉపేక్షించబోమన్నారు. వచ్చిన ప్రతి అర్జీని అధికారులు పరిశీలించి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, సరైన పరిష్కారం కాక, అర్జీ మళ్లీ రీఓపెన్‌ అయ్యే పరిస్థితి తలెత్తరాదని కలెక్టర్‌ తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ అశుతోష్‌ శ్రీవాస్తవ, ఇన్‌ఛార్జి జెసి కె.హేమలత, ఎస్‌డిసి పి.ధర్మచంద్రారెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఐటిడిఎ పిజిఆర్‌ఎస్‌కు 61 వినతులుస్థానిక ఐటిడిఎలో సోమవారం నిర్వహించిన పిజిఆర్‌ఎస్‌కు 61 అర్జీలు వచ్చాయి. ఐటిడిఎ పిఒ సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐటిడిఎ ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలను సమర్పించుకున్నారు. మొత్తం 61 మంది వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఇఇ రమాదేవి, పిహెచ్‌ఒ వెంకట గణేష్‌, డిప్యూటీ డిఇఒ రవి ప్రసన్న కుమార్‌, పశుసంవర్ధక శాఖ ఎడి శ్రీనివాసరావు ట్రాన్స్‌కో డిఇ గోపాలకృష్ణ, వెలుగు ఎపిడి సన్యాసిరావు, ఉపాధి హామీ ఎపిడి శ్రీహరిరావు సిడిపిఒ రంగలక్ష్మి , ఇతర సెక్టోరల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలి : ఎస్‌పి

పార్వతీపురంరూరల్‌ : జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని ఎస్పీ ఎస్‌వి మాధవ్‌ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 14 ఫిర్యాదుదారులు వచ్చాయి. అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ఎస్‌పి ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. కార్యక్రమంలో డిసిఆర్‌బి. ఎస్సై ఫ్రక్రుద్దీన్‌, సిబ్బంది పాల్గొన్నారు.రోగుల చెంతకే ఎక్స్‌ రే మిషన్‌గిరిజన ప్రాంతాల్లోని క్షయవ్యాధి రోగుల చెంతకే సంచార ఎక్స్‌ రే మిషన్‌ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో పిజిఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో షిప్పింగ్‌ కార్పొరేషన్‌ అఫ్‌ ఇండియా విరాళంగా అందించిన సంచార ఎక్స్‌ రే మిషన్‌ యూనిట్‌ను కలెక్టర్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో క్షయవ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. అటువంటి వారంతా ఇకపై ఎక్స్‌ రే కోసం పార్వతీపురం ప్రభుత్వాసుపత్రికి రావాల్సిన అవసరం లేదన్నారు. ఈ మిషన్‌ ద్వారా రోగుల ఇంటి వద్దనే ఎక్స్‌రే తీసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. శరీరంలోని ఏ భాగాన్ని అయిన ఎక్స్‌రే తీసుకోవచ్చని, దీంతో రోగులకు సేవలు మరింత సులభతరం అవుతుందని అన్నారు. రూ.30 లక్షల విలువ గల ఈ యూనిట్‌ను షిప్పింగ్‌ కార్పొరేషన్‌ అఫ్‌ ఇండియా కమాండర్‌ వై.ఫణీంద్ర విరాళంగా అందించారని కలెక్టర్‌ ఈ సందర్బంగా ఆయనకు అభినందనలు తెలిపారు.సిఎస్‌ఆర్‌ కింద వసతి గృహాలకు యుబిఐ ఫర్నీచర్‌ వితరణపార్వతీపురంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వినియోగార్ధం యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఫర్నీచరును అందజేసినట్లు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్‌) కింద లక్ష రూపాయల విలువైన 4 బీరువాలు, 4 టేబుళ్లు, 4 విజిటింగ్‌ చైర్స్‌, 20 నీల్‌ కమల్‌ కుర్చీలను విరాళంగా అందించినట్లు చెప్పారు. యుబిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ప్రాంగణంలో సోమవారం ఫర్నీచర్‌ వితరణ కార్యక్రమం జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యాన జరిగింది. ఈ సందర్బంగా యుబిఐ శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయం అధికారులు ఫర్నీచర్‌ ను కలెక్టర్‌కు అందజేశారు. వసతి గృహాలకు ఫర్నీచర్‌ను అందజేయడం పట్ల కలెక్టర్‌ హర్షం వ్యక్తం చేశారు.

➡️