తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలి : కలెక్టర్‌

Apr 16,2025 21:18

 ప్రజాశక్తి-విజయనగరం :  పోషకాహారాన్ని అందించడం, అవసరమైన మందులను సరఫరా చేయడం, సంపూర్ణ అవగాహన కల్పించడం ద్వారా తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండాలన్నది మనందరి ధ్యేయం కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ పిలుపునిచ్చారు. దీనికోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పౌష్టికాహార పక్షోత్సవాల్లో (పోషణ్‌ పక్వాడా) భాగంగా స్త్రీశిశు సంక్షేమశాఖ, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖల సమన్వయ సమావేశం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బుధవారం జరిగింది. కలెక్టర్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ, బాలబాలకల ఆరోగ్యంపై అన్ని శాఖలూ దృష్టి పెట్టాలన్నారు. పోషకాహారాన్ని అందించడంతోపాటు, వ్యాధి నిరోదక టీకాలను సకాలంలో వేయడం, తల్లులకు ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న సుమారు 69,000 మంది చిన్నారుల్లో, బరువు తక్కువగా ఉన్నవారు దాదాపు 4వేల మంది ఉన్నారని, వీరికి పౌష్టికాహారాన్ని అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లాలో సుమారు 7వేల మంది మరుగుజ్జు పిల్లలు ఉన్నారని, ఇతర జిల్లాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణాలను అన్వేషించి, అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖలపై ఉందని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలో చిన్నవయసులోనే గర్భం దాలుస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని, దీనిని నివారించడానికి బాలికలకు, తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఐసిడిఎస్‌ పిడి రూక్సానా బేగం, డిఇఒ మాణిక్యం నాయుడు, డిఎంఅండ్‌ హెచ్‌ఒ డాక్టర్‌ జీవనరాణి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ కవిత తదితరులు మాట్లాడారు. పక్షోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గర్భిణులకు శీమంతం చేశారు. సమావేశంలో ఐసిడిఎస్‌ సిడిపిఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎంఈఓలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

➡️