ప్రజాశక్తి – పార్వతీపురం : గర్భిణుల ఆరోగ్యం, సురక్షిత ప్రసవం మహిళా శిశు సంక్షేమ శాఖ బాధ్యత అని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రతి మహిళ గర్భిణిగా ఉన్నప్పటి నుంచే వారి ఆరోగ్యాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. రక్తహీనత పట్ల దృష్టి సారించాలన్నారు. రక్తహీనత నుంచి విముక్తి పొందడానికి అంగన్వాడీలదే 90 శాతం బాధ్యత అని ఆయన అన్నారు. ఆహారాన్ని సక్రమంగా అందించడం, వారిని పర్యవేక్షించడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చని స్పష్టం చేశారు. ప్రతి గర్భిణీ మహిళ సురక్షిత ప్రసవం కావాలని, ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించాలని ఇందుకు మొదటి నుంచి స్పష్టమైన అవగాహన కల్పించడం, పౌష్టికాహార విలువలు తెలియజేయడం అవసరమని ఆదేశించారు. గర్భిణీ మహిళలు, బాలింతలకు టేక్ హౌమ్ రేషన్ ఇవ్వడమే కాకుండా, అంగన్వాడీ కార్యక్రమాలు చక్కగా సాగాలని అన్నారు. ఆటలు, పాటల ద్వారా విద్యను నేర్పాలని, విద్య పట్ల ఆసక్తిని కల్పించాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ అంటే ఆహార పదార్థాలు పెట్టే ప్రదేశం గానే మిగలరాదని, ఆహ్లాదకరమైన సంపూర్ణ వికాస కేంద్రాలుగా గౌరవం సాధించాలని అన్నారు. ఫోర్టీ ఫైడ్ రైస్ తో వివిధ పౌష్టిక ఆహార పదార్థాలు తయారు చేయవచ్చని, గ్రామాల్లో సంబంధిత ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి అంగన్వాడి ”సుపోషిత్” బహుమతులు అందుకోవాలని ఆకాంక్షించారు. ”కిషోరీ వికాసం” కార్యాచరణ ప్రణాళిక పక్కాగా తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమం కింద ఏ ఒక్కరూ డ్రాప్ అవుట్‌గా బడి బయట ఉండరాదని, ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించడం లేదా తమకు అవసరమగు రంగాల్లో శిక్షణ పొందడం, ఉద్యోగాలను పొందడం జరగాలని ఆయన స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు వీటి పర్యవేక్షణ చేపట్టి త్వరగా పనులు పూర్తి కావడానికి సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారిత అధికారి డా. టి కనకదుర్గ, డిసిపిఒ ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
