ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగర కమిషనర్ పి.నల్లనయ్య వ్యవహార తీరును నిరసిస్తూ ఉ సచివాలయ ఉద్యోగుల ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో కమిషనర్‌కు మద్దతుగా కార్యాలయ ఉద్యోగులు నగర పాలకసంస్థ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఉద్యోగుల సంఘం నాయకులు అప్పలరాజు, అసిస్టెంట్ కమిషనర్ తిరుమలరావు, ఎసిపిఐవి రమణమూర్తి, ఎంహెచ్‌ఒ సాంబమూర్తి ధర్నాకు నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిషనర్ పల్లి నల్లనయ్య పట్ల వార్డు సచివాలయ కార్యదర్శుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పన్నుల వసూలులో వెనుకబడి ఉన్న సచివాలయ పరిపాలనా కార్యదర్శులను వెనుకబాటుకు కారణాలు తెలియజేయాలని కమిషనర్ అడగడం తప్పా అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో కొంతమంది పట్ల కఠినంగా మాట్లాడినప్పటికీ అందులో పన్నుల వసూలు నిమిత్తము దిశానిర్దేశం చేస్తే ఉద్దేశమే తప్ప ఎవరినీ కించపరిచే భావంతో కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌కు వ్యతిరేకంగా కలెక్టర్‌కు, మంత్రికి, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడం తగదని అన్నారు. ఈవిషయంలో తామంతా కమిషనర్‌కు అండగా ఉంటున్నామని తెలిపారు.
