ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బుధవారం 36వ డివిజన్ 43వ సచివాలయం పరిధిలో ఆయన పర్యటించారు. పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి పంపిణీ వంటి అంశాలను పరిశీలించారు. పారిశుధ్య పరంగా కొన్ని లోపాలు గుర్తించి వాటిని సరి చేసుకోవాలని ప్రజారోగ్య సిబ్బందికి ఆదేశించారు. లేని పక్షంలో సస్పెండ్ చేస్తామని మందలించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసిన రీత్యా పబ్లిక్ హెల్త్ వర్కర్ ను విధుల నుండి తాత్కాలికంగా కమిషనర్ సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలని అన్నారు. ఈ విషయంలో ప్రజల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే పారిశుధ్య ప్రక్షాళనకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.ప్రజా ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలిసచివాలయాలకి వచ్చే ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే దిశగా కార్యదర్శులు కృషి చేయాలని కమిషనర్ నల్లనయ్య సూచించారు. బుధవారం 6, 8 నెంబర్ల సచివాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయాలకు కార్యదర్శులు నిర్ణీత సమయానికి హాజరవుతున్నారా లేదా అని పరిశీలించారు. రికార్డులను తనిఖీ గమనించారు. సచివాలయాలు పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన పౌర సేవలు అందించేందుకు సచివాలయాల కార్యదర్శులు మరింతగా కృషి చేయాలని అన్నారు.
