ప్రజాశక్తి -మధురవాడ : మధురవాడ జోనల్ కార్యాలయం వద్ద ప్రతి శనివారమూ నిర్వహిస్తున్న సంతను కొమ్మాది కూడలి వద్ద పెట్టుకోవాలని వర్తకులపై నిర్భంధం ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం మధురవాడ జోనల్ కార్యాలయం వద్ద సంత వర్తకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ, కొమ్మాది కూడలి నుంచి గ్రామీణ ప్రాంతం వరకు ఉన్న బృహత్తర ప్రణాళికా రహదారిపై భారీ వాహనాలు తిరిగే ప్రాంతంలో సంతను ఏర్పాటుచేస్తే ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. ధర్నాకు ముందు మూడు సార్లు జోనల్ కమిషనర్ సింహాచలం, ట్రాఫిక్ సిఐ కాంతారావు, శాంతి భద్రతల విభాగం ఎస్‌ఐ సురేష్, ట్రాఫిక్ ఎస్‌ఐలు, టిడిపి నాయకులు ఎం.లక్ష్మణ, వి.అప్పలరాజు చర్చలు జరిపారు. చర్చలు ఫలించక పోవడంతో ధర్నాకు దిగారు. జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. సాయంకాలం యథావిధిగా సంతను కొనసాగించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.రాజ్‌కుమార్, డి.అప్పలరాజు, జి.కిరణ్, ఐఎఫ్‌టియు నాయకులు ఎం.లక్ష్మి, అరుణ, సంత సంఘం నాయకులు టి.అప్పారావు, వెంకటరమణ, బి.రమణ, శంకరరావు, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.