ప్రజాశక్తి – సాలూరురూరల్ : రాజ్యాంగం ఏర్పడి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా సాలూరు పట్టణంలోని నాలుగో వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మహిళా శిశు, సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి మంగళవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించించి ప్రజలు ఏ విధంగా ఉండాలి, వారి హక్కులు, విధులు ప్రతి ఒక్కరికీ తెలియజేసి మంచి మార్గంలో నడిపించేలా చేశారని చెప్పారు. భారత రాజ్యాంగంలో అందరూ కలిసి మెలసి మెలగాలనే ప్రధాన లక్ష్యంగా సాగిందన్నారు. ముఖ్యంగా అట్టడుగున గల అణగారిన వర్గాలను బయటకు తీసుకురావాలని ఒక మంచి ప్రయత్నంతో రాజ్యాంగాన్ని పొందుపరిచారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు)లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ వి.హరగోపాల్ నేతృత్వంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఏర్పడ్డానికి దారి తీసిన పరిస్థితుల గురించి విద్యార్థులకు వివరించారు. కాలేజీ పౌరశాస్త్ర అధ్యాపకులు ఎ.వెంకటేశ్వర్ రాజ్యాంగ పీఠికను చదివి విద్యార్థిని, విద్యార్థులతో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ పైల శంకరరావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు, జి.గోవిందరావు అధ్యాపకులు పాల్గొన్నారు.
వీరఘట్టం : మండలంలోని వండువలో మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ బి.వెంకటరమణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కంబరవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల వై.లక్ష్మి, వీరఘట్ట జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం బి.సుంబోరా, తదితర పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎం.కల్యాణి, మహిళలు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్: భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు పట్టణంలోని పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం గొప్పతనం గురించి వివరించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ కె.రూపేష్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకగా నిర్వహించి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థులచే ప్రతిజ్ఞ, రాజ్యాంగ దినోత్సవ ఆవశ్యకత వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాజు, రవి కుమార్, సుకన్య, శాంతి ,తాతబాబు, సత్యనారాయణ, శ్రీధర్, కైలాష్ ,శర్మ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
కురుపాం : స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో జె. ఉమామహేశ్వరి రాజ్యాంగ నిర్మాతలు అంబేద్కర్, బాబు రాజేంద్రప్రసాద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎపిఒ బావాజీ, జెఇ మూర్తి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సాలూరు రూరల్ : ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగంమనిరాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కె వి సత్యన్నారాయణ అన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రాంగణంలో రాజ్యాంగ అమలుకు తమ వంతు కషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఇన్చార్జి ఉపాధ్యాయులు సుధీర్ రాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు భాస్కర్ రావు విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, వకత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.
వీరఘట్టం : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల చే ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డిఎస్‌వి త్రినాధ్ , వైస్ ప్రిన్సిపాల్ ఎం.కుమార స్వామి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పార్వతీపురం టౌన్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసి రావులు అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవ సందర్భంగా వేమకోటివారివీధిలో గల అంబేద్కర్ విగ్రహానికీ మాజి కౌన్సిలర్ సొండి గోపి, వెంకటరమణలు పూలమాల వేసి, అనంతరం అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కోల సుధాకర్, సొండి భాస్కరరావు, కోల రాజు, కోల నవీన్ స్థానికులు పాల్గొన్నారు.