పేదలకు అండగా సిపిఎం

Mar 12,2025 21:51

2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సిందే

సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని

వాడవాడలా ప్రజాచైతన్యయాత్ర

ప్రజాశక్తి-శృంగవరపుకోట, జామి :  పేదలకు ఎల్లప్పుడూ సిపిఎం అండగా ఉంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. భూమిని కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. సిపిఎం తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఎస్‌.కోటలో సిపిఎం నాయకులు పర్యటించారు. మండల కేంద్రంలో రైతులు, జగనన్న కాలనీలో ప్రజలు తమ సమస్యలను వివరించారు. పెందుర్తి నుంచి మండలంలోని బొడ్డవర వరకు నాలుగు లైన్ల రహదారిగా విస్తరించబోతున్న 516 బి జాతీయ రహదారికి మండలంలోని రెండు చోట్ల బైపాస్‌ రోడ్డు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ రహదారిలో 33 ఎకరాల భూమిని రైతులు కోల్పోతున్నారని తెలిపారు. ఇప్పటికే అదే రైతుల భూముల్లో నుంచి పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి సర్వేలు చేపట్టారని, పేద రైతులకు ఉన్న కాస్తంత జిరాయితీ పల్లపుభూమిని ప్రభుత్వం రైతుల అనుమతి లేకుండా బలవంతంగా తీసుకోవాలని చూస్తున్నారని తెలిపారు. తమ్మినేని స్పందిస్తూ భూములను కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం ఐదు రెట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌.కోట, అరకు రోడ్డులో ఆక్రమణలు తొలగిస్తే బైపాస్‌ రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుండి భూములు తీసుకోవలసిన అవసరం ఉండదని అన్నారు. అలా కాకుండా రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తే పోరాడుతామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి తాహశీల్దార్‌ అరుణకుమారికి వినతి అందజేశారు. అనంతరం పట్టణంలో దేవిబొమ్మ కూడలి మీదుగా ఆర్‌టిసి కాంప్లెక్సు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగనన్న కాలనీలో పర్యటించిన ఆయనకు పేదలు పలు సమస్యలను వివరించారు. రహదారి, కాలువలు, తాగునీరు లేవని, ఇంటింటి కొలాయి పాయింట్లు ఇచ్చారే తప్ప గుక్కెడు తాగునీరు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. తమ్మినేని స్పందిస్తూ ఈ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీ పోరాటం చేస్తామని తెలిపారు. ఈనెల18.19.20తేదీల్లో ప్రజా సమస్యలపై తాహశీల్దార్‌ కార్యాలయాల వద్ద నిర్వహించు ధర్నాలో అందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా పూర్వ నాయకులు టి.అన్నపూర్ణమ్మ, సిపిఎం మండల కార్యదర్శి మద్దిల రమణ, సిహెచ్‌ ముత్యాలు, ఎస్‌.అర్జున్‌, రైతులు పి.సూరిబాబు, ఎం.సత్యారావు, పి.రమణ, పి.కృష్ణ, ఎం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

భీమసింగి దళిత కాలనీలో పర్యటన

జామి మండలంలోని భీమసింగి దళిత కాలనీలో సిపిఎం నాయకుల బృందం పర్యటించి కాలనీ వాసుల సమస్యలు తెలుసుకున్నారు. తమకు రహదారి, తాగునీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలు లేవని, అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. జిల్లా కార్యదర్శి తమ్మినేని స్పందిస్తూ సిపిఎం ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందని, ఆ సమస్యల పరిష్కారానికి ఈనెల 19న జామి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాకు రావాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఎమ్‌ జిల్లా నాయకులు గాడి అప్పారావు, మద్దిల రమణ, మీసాల రంగమ్మ, మీసాల కొండమ్మ, మీసాల లక్ష్మి నేలపు రాములమ్మ సింహాచలం రాము తదితరులు పాల్గొన్నారు.

లక్కవరపుకోట : మండల కేంద్రంలో సిపిఎం నాయకులు గాడు అప్పారావు, టి.వెంకటరమణ, పివి రమణ తదితరులు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలపై విద్యుత్తు భారాలు వేసిందని, ధరలు పెంచిందని తెలిపారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించడం లేదన్నారు.ఈ సమస్యల పరిష్కారాటానికి పోరాటాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జామి సత్యవతి జామి నాగమ్మ సింహాచలం తదితరులు పాల్గొన్నారు

➡️